ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి వర్షాల ప్రభావం చూపనున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాతావరణ మార్పులు రాష్ట్రానికి కాస్త అతిగా మోస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. పలు చోట్ల కురుస్తున్న వర్షాలకు వర్షాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువార ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు అలెర్ట్‌లు జారీ చేశారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, కృష్ణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ కాగా, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. గురువారం కూడా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ అమల్లో ఉంటే, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పల్నాడు, గుంటూరు, కృష్ణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
మరోవైపు తీరప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అలజడి ఎక్కువగా ఉండనున్న కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఇప్పటికే తీర ప్రాంతంలోని హార్బర్లు, జెట్లకు వందలాది బోటులు చేరుకున్నాయి. అత్యవసర సేవల విభాగాలు అప్రమత్తం కావాలని కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అన్ని జిల్లాల్లోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో నేరుగా జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూంలకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. వర్షాలు కొనసాగుతున్న వేళ వ్యవసాయం, రవాణా, విద్యుత్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అసౌకర్యానికి లోనుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
