అనంతపురం జిల్లాలో దారుణం.. లారీ ఢీ కొని ఇద్దరు మహిళలు మృతి…!

దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజుకి పెరుగుతుంది. ప్రమాదాలను అరికట్టటానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా రోడ్డు ప్రమాదాల వల్ల తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొంతమంది బయటపడగా.. మరి కొంతమంది మాత్రం వారి పొరపాటు లేకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో కూడా ఇటువంటి దారుణం చోటు చేసుకుంది. వర్షాకాలంలో చెరువులు నిండి నీరు ఏరులై పారుతుంటే చూడటానికి వచ్చిన ఇద్దరు మహిళలను లారీ డీ కొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వివరాలలోకి వెళితే…అనంతపురం జిల్లా బెళుగప్ప మండలం కాల్వపల్లి దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేరూరు డ్యాం నిండటంతో ఇటీవల గేట్లు ఎత్తారు. ఈ క్రమంలో కాల్వపల్లి వద్ద కెనాల్ లో నీరు ప్రవహిస్తూ ఉండటంతో అందరూ ఆ ప్రవాహాన్ని చూడటానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరు మహిళలు కూడా ఆ ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆత్మకూరు నుండి వస్తున్న లారీ వేగంగా వచ్చి ఆ మహిళల పైనుంచి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వారు తీవ్రంగా గాయపడి అవయవాలు చిత్రమైపోయాయి. దీంతో ఆ మహిళలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరగగానే భయంతో లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు లారీని వెంబడించారు.

ఈ క్రమంలో బోరంపల్లి-గోళ్ల గ్రామాల మధ్య లారీ డ్రైవర్‌ను పట్టుకుని ప్రజలు దేహశుద్ధి చేశారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గురైన మహిళలు లక్ష్మీదేవి, సరస్వతిగా గుర్తించారు. అనంతరం వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇలా ఎంతో సంతోషంగా నీటి ప్రవాహాన్ని చూడటానికి వచ్చిన మహిళలు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు రోజున వర్ణాతీతంగా మారింది. బాధితుల మరణానికి కారణమైన లారీ డ్రైవర్ ని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.