ఆనందయ్య మందుకు ఇటీవలనే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు పంపిణీ నిన్నటి నుంచి ప్రారంభమైంది. నెల్లూరుజిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పసరు మందు పంపిణీ ప్రారంభించారు. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ముందుగా మందు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తాము భారీ మొత్తంలో మందు తయారు చేయగలమని, ఆ మందును ప్రభుత్వం ప్రజలకి పంపిణీ చేయాలని కొరుతూ ఈ రోజు ఆనందయ్య సీఎం జగన్ కి లేఖ రాశారు.
ఒక్కో జిల్లాకు ఐదు వేల ప్యాకెట్లు పంపేందుకు గాను తాము మందుని సిద్ధం చేయగలమని ఆనందయ్య ఆ లేఖలో వివరించారు. ముడిసరుకు సేకరణకు, ఔషధం తయారీకి సహకరించాలని ప్రభుత్వాన్ని ఆనందయ్య కోరారు. కరోనా బాధితుల కోసం మందును ఎక్కువ మొత్తంలో తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సైతం పంపిస్తామని ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న వసతిని ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో కోరటం జరిగింది.
నేడు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, పొదలకూరు మండలాల్లో మందు పంపిణీ చేయనున్నారు. ఆనందయ్య కరోనా మందును కృష్ణపట్నంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా ఆనందయ్య లేఖకి జగన్ నుండి ఎటువంటి స్పందన వస్తుందో అని అందరు ఎదురు చూస్తున్నారు.