నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం గ్రామానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందుకి దేశవ్యాప్తంగా అభిమానులు కనిపిస్తోన్న విషయం విదితమే. ఆ మందులో కరోనా వైరస్‌ని నయం చేసే గుణాల్లేవని ప్రభుత్వం శాస్త్రీయంగా నిరూపించినా, ఆనందయ్య నాటు మందుకి క్రేజ్ మాత్రం దక్కడంలేదు. నాటు మందు వాడిన ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇటీవల మరణించినప్పటికీ, ఆనందయ్య నాటు మందుపై అదేమీ దుష్ప్రభావం చూపలేదు. ఇక, ప్రభుత్వం నుంచి ఆనందయ్య నాటు మందుకి అనుమతి లభించడమే కాదు, త్వరలో ఆన్‌లైన్‌లో ఆనందయ్య నాటు మందుని అందరికీ అందించేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మందు తయారీ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యిందట. నాలుగైదు రోజుల్లో మందుని పంపిణీ చేస్తామని అధికారులు అంటున్నారు.
కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించి, ఆనందయ్య నాటు మందుని ఎవరైనా తీసుకోవచ్చంటున్నారు. ఆనందయ్య నాటు మందుకోసం కృష్ణపట్నం గ్రామానికి ఎవరూ వెళ్ళాల్సిన పనిలేదట. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే, ఇంటి వద్దకే మందుని పంపించే ఏర్పాట్లు కూడా చేయబోతున్నారట. అయితే, ఈ నిమిత్తం ఎంత వసూతు చేస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోపక్క, ఆనందయ్య నాటు మందుతో కరోనా తగ్గదని తేలిపోయినా, ఆ మందుని ప్రభుత్వం ప్రమోట్ చేయాలనుకోవడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరి నమ్మకాలు వారివి.. కోవిడ్ కోసం డాక్టర్లు సూచించిన మందులు వాడుతూనే, ఆనందయ్య నాటు మందుని కూడా వాడుకోవచ్చన్నది ప్రభుత్వం చెబుతున్నమాట. ఇదిలా వుంటే, ఆనందయ్య విషయంలో నిన్న మొన్నటిదాకా హంగామా చేసిన విపక్షాలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. పూర్తిగా ఆనందయ్య ప్రభుత్వం వైపు మళ్ళడంతో, విపక్షాలకు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి.