నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు విషయమై రాజకీయ రగడ ఏ స్థాయిలో జరుగుతోందో చూస్తున్నాం. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి షాక్ తగిలింది.
శేశ్రిత అనే ఓ సంస్థ ఓ అప్లికేషన్ తయారు చేసి, దాని ద్వారా ఆనందయ్య నాటు మందుని ఆన్‌లైన్ ద్వారా డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందుకోసం కొంత మొత్తాన్ని రుసుముగా ఆ సంస్థ పేర్కొంటోంది. అయితే, ఇది ఇంకా అమల్లోకి రాలేదు. ఇంతలోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తొందరపడ్డారు.. 120 కోట్ల రూపాయల కుంభకోణం ఇందులో దాగి వుందనీ, వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి శేశ్రిత సంస్థతో సంబంధాలున్నాయనీ మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెట్టారు సోమిరెడ్డి.
అయితే, శేశ్రిత సంస్థ ఎండీ ఈ విషయమై గుస్సా అయ్యారు. తమ అప్లికేషన్ సమాచారాన్ని సోమిరెడ్డి దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆనందయ్య నాటు మందు ఉచితమే అయినా, దాన్ని ప్యాకింగ్ చేయడానికీ, రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీ చేయడానికీ ఖర్చవుతుంది కాబట్టే, కొంత మొత్తాన్ని రుసుముగా పేర్కొంటున్నామనీ, అయితే ఇంతవరకూ ఎవరి నుంచీ సొమ్ములు వసూలు చేయలేదని నర్మద రెడ్డి చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆనందయ్య నాటు మందుకి విపరీతమైన పాపులారిటీ పెరిగిన విషయం విదితమే. దాంతో, తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచీ ఆనందయ్య నాటు మందు కోసం జనం ఎగబడుతున్నారు.
ఈ నేపథ్యంలో మందు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవనే ధృవీకరణ తప్పనిసరైంది ప్రభుత్వానికి. దీన్నొక బాధ్యతగా తీసుకుని ప్రభుత్వం తగిన పరీక్షలు నిర్వహించి క్లీన్ చిట్ ఇచ్చినా, ఆ మందు కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని మాత్రం సర్టిఫై చేయలేదు. అలాంటప్పుడు ఇందులో ప్రభుత్వానికిగానీ, అధికార పార్టీకిగానీ అత్యుత్సాహం వుందని ఎలా అనగలం.? నోరు పారేసుకుని అడ్డంగా బుక్కయిన సోమిరెడ్డి, ఇప్పుడీ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.