నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా వైరస్ బారిన పడ్డవారికి తాను తయారు చేసే నాటు మందు ద్వారా వైద్య చికిత్స అందిస్తానని చెబుతోన్న సంగతి తెలిసిందే. ఆయన తయారు చేసిన మందు ఇప్పటికే చాలామందికి చేరింది. అందులో ఎంతమందికి కరోనా నయమయ్యింది.? ఎంతమందికి కరోనా రాకుండా ఆ మందు పనిచేసింది.? అన్నదానిపై సరైన లెక్కల్లేవు. తాజాగా సినీ నటుడు జగపతిబాబు, ఆనందయ్య తయారు చేసిన మందుని తాను వేసుకున్నాననీ, అది బాగా పనిచేసిందని చెప్పారు. ఇంకోపక్క, సోమవారం నుంచి ఆనందయ్య నాటు మందు అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది. ఈలోగా కొత్త లొల్లి మొదలైంది.
వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆనందయ్య మందుతో వ్యాపారం చెయ్యడం కోసం తన సన్నిహితుల్ని రంగంలోకి దించారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఇలా వుంటే, ఆనందయ్య నాటు మందు వేసుకున్న ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇటీవల కరోనా కారణంగానే ఆసుపత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆనందయ్య నాటు మందు (చుక్కల మందు) కంట్లో పడగానే తనకు కరోనా తగ్గిపోయిందనీ, ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయనీ చెప్పుకున్నాడా రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య.
ఆ కోటయ్య కరోనాతో చనిపోయాక, ఆనందయ్య నాటు మందు మీద అనుమానాలు పెరిగిపోయారు. కోర్టు కేసులు తదితర వ్యవహారాల నడుమ, ఆనందయ్య నాటు మందుతో ఎలాంటి దుష్ప్రభావాలూ లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. అలాగని, ఆ మందుతో కరోనా నయమవుతుందనీ చెప్పలేదు. అయినా, ఆనందయ్య మాత్రం తన మందు భేషుగ్గా పనిచేస్తుందని చెబుతున్నాడు.
ఎంతోమందికి నయం చేశానంటున్నాడు. అత్యాధునిక వైద్య శాస్త్రానికే సవాల్ విసురుతున్నాడు. కానీ, జనంలో కొన్నాళ్ళ క్రితం వున్న క్రేజ్ మాత్రం ఆనందయ్య మందుకి ఇప్పుడు లేదు. కరోనా కేసులు తగ్గడం ఓ కారణం కాగా, ఆనందయ్య మందుపై వస్తున్న విమర్శలతో, మందు వేసుకోవాలన్న ‘ఆసక్తి, ఆనందం’ రెండూ తగ్గిపోయాయి జనాల్లో.