ఆనందయ్య నాటు మందుకి ఊరట దక్కిందిగానీ..

Anandayya Natu Mandu Gets Green Signal, But..

Anandayya Natu Mandu Gets Green Signal, But..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన నాటు వైద్యుడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మీద ఆనందయ్య తయారు చేసిన నాటుమందు బాగా పనిచేస్తోందన్న ప్రచారమే ఇందుకు కారణం. ఆ మందు పనిచేస్తోందా.? లేదా.? అన్నదానిపై ప్రత్యక్షంగా ఆ మందు వాడినవాళ్ళెవరూ ఘంటాపథంగా చెప్పలేదుగానీ, దీని చుట్టూ జరిగిన రాజకీయం మాత్రం, ఆనందయ్య పేరుని దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసింది. పెద్దయెత్తున నాటు మందుకోసం జనం తరలి రావడంతో, చిన్న గ్రామమైన కృష్ణపట్నం విలవిల్లాడింది. మరోపక్క, జనాన్ని అదుపు చేయలేకపోయిన పోలీసులు, నాటుమందు పంపిణీని నిలిపివేశారు. ఆయుర్వేద గ్రంధాల్లో వున్న మూలికలతోనే ఈ నాటు మందుని తయారు చేసినట్లు ఆనందయ్య చెప్పారు. ఆ మందు వివిధ రూపాల్లో మార్కెట్లో వేరే కంపెనీలు అందుబాటులో వుంచాయి కూడా.

ఆ సంగతి పక్కన పెడితే, ఆనందయ్య మందుపై పరిశోధనలంటూ ఇన్ని రోజూలూ ప్రభుత్వం ఆ మందుని పంపిణీ చేయనీయకుండా అడ్డుకుంది. అన్ని పరీక్షల ఫలితాలు రావడంతో, మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని చెబుతున్న ప్రభుత్వం, ప్రయోజనాలు కూడా ఏమీ లేవని పేర్కొనడం గమనార్హం. ఆనందయ్య నాటు మందు ద్వారా కరోనా తగ్గుతుందని చెప్పలేం.. అని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో, ఆనందయ్య నాటు మందుకి శాస్త్రీయత లేదన్నమాట. అది కరోనా మీద అస్సలేమాత్రం ప్రభావం చూపలేదన్నమాట. ఇదిలా వుంటే, ఆనందయ్య మందు (కంట్లో వేసే చుక్కల మందు) తీసుకున్న రిటైర్డ్ ఉద్యోగి కోటయ్య ఈ రోజు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మందు కోసం వెళ్ళే సమయంలో నీరసంగా కనపించిన కోటయ్య, మందు కంట్లో వేసుకోగానే, ఆక్సిజన్ మాస్కు తీసేసి.. తనకు రోగం నయమైపోయిందని చెప్పుకున్నా, ఆ వెంటనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొన్ని రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఈరోజు కన్నుమూశారు కోటయ్య.