నెల్లూరు జిల్లాకి చెందిన నాటువైద్యుడొకరు కరోనా వైరస్ మీద అస్త్రమంటూ నాటు మందునొకదాన్ని తయారు చేశారన్న వార్త, ఆ మందు బాగా పనిచేస్తోందన్న ప్రచారం.. చాలామంది కరోనా బాధితుల్ని అటువైపుగా మళ్ళించింది. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి మద్దతుతో నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా మందుని తయారు చేసేసి, చాలామందికి ఉచితంగానే అందించేశాడు. అయితే, ఆ మందు విషయమై చాలా రచ్చ జరుగుతోంది. ఆనందయ్య తయారు చేసిన నాటు మందు గనుక పనిచేస్తుందని తేలితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పంపిణీ చేయాలనే ఆలోచనలో వుంది రాష్ట్ర ప్రభుత్వం. వీలైనంత త్వరగా ఆ మందుపై రకరకాల పరీక్షలు నిర్వహించి, నిజాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు నానా హైరానా పడుతున్నారు. ప్రస్తుతానికైతే ఆ మందుతో దుష్ప్రభావాలేమీ లేవని తేలింది. మరిన్ని పరీక్షలు జరగాల్సి వుంది. ఇంకోపక్క నాటు వైద్యుడు ఆనందయ్యని వైసీపీ నేతలు ‘వంట మేస్టారు’గా మార్చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సందట్లో సడేమియా.. అన్నట్టు, బాబు గోగినేని అనే ఓ మేధావి, హ్యుమానిటీ కలిగిన మేధావి.. ఆనందయ్య నాటు మందుని ‘చట్నీ’గా అభివర్ణించి వార్తల్లోకెక్కారు.
ఇంకేముంది, ఆనందయ్య అభిమాన సంఘం, బాబు గోగినేనిపై మండిపడుతోంది. అదే సమయంలో, బాబు గోగినేని అభిమానులూ.. ఆనందయ్య అభిమానులపై గుస్సా అవుతున్నారు. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేస్తూ, బాబు గోగినేనిని కడిగి పారేసింది. క్రిస్టియన్లు, ‘మెడిసిన్’గా వాడే కొబ్బరి నూనె గురించి ఎందుకు ఎప్పుడూ విమర్శలు చేయలేదు.? అన్నది గోగినేనిపై మాధవీ లత సంధించిన ప్రశ్న. కాగా, పలు రకాల టూత్ పేస్టులు.. ‘ఉప్పుందా.?’ అంటూ చేస్తున్న ప్రచారంపై ఎందుకు స్పందించలేదని గోగినేని బాబు మీద, ఆనందయ్య అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇంతకీ ఆనందయ్య తయారు చేసిందేంటి.? నాటు మందేనా.? గోగినేని బాబు చెబుతున్నట్లుగా చట్నీనా.?