తిరుపతి ఉప ఎన్నికలు వేదికగా జగన్‌తో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే 

వైకాపాకు గత ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం ఇచ్చిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడా ఒకటి.  ఈ జిల్లాలో ఉన్న 10కి 10 అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.  ఇలాంటి జిల్లాలో కొన్నాళ్ళుగా పార్టీ కీలక నేతల మధ్యన సయోధ్య తప్పిన వాతావరణం కనిపిస్తోంది.  మంత్రి పదవుల కేటాయింపులు జరిగినప్పుడు జిల్లా ఎమ్మెల్యేల మధ్యన మొదలైన అంతరాలు మెల్లగా తారాస్థాయికి చేరాయి.  వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం  రామనారాయణరెడ్డికి యువ లీడర్లతో అస్సలు పొసగని పరిస్థితి కనబడుతోంది.  జిల్లా రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం తగ్గుతోందని  ఆనం  భావిస్తున్నారు.  జిల్లా మంత్రులు తన నియోజకవర్గంలో తన నోటీసుకు వెళ్లకుండానే కలుగజేసుకుంటుండటం ఆయన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది.

Anam Ramanarayanareddy planning to meet YS Jagan
Anam Ramanarayanareddy planning to meet YS Jagan

 ఈ విషయమై ఒకసారి ధిక్కార స్వరం వినిపించారు.  కానీ అధిష్టానం నుండి షోకాజ్ నోటీసుల హెచ్చరింపు రాగానే వెనక్కు తగ్గారు.  ఆతరవాత కొన్నాళ్ళు మౌనంగానే ఉన్న ఆయన మళ్ళీ ఆగ్రహానికి లోనవుతున్నారట.  నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండానే అధికారుల బదిలీలు జరిగిపోతున్నాయట.  మంత్రుల చేతుల మీదుగా జరిగే పనుల్లో ఒక్కటి కూడ ఆయనకు తెలియట్లేదట.  పదవుల పంపకంలోనూ అదే పరిస్థితి.  కాంగ్రెస్ హయాంలో రామనారాయణరెడ్డి జిల్లా రాజకీయాలను శాసించారు.  అలాంటి చరిత్ర కలిగిన తనను ఇంతలా నిర్లక్ష్యం చేయడం ఏమిటనేది ఆయన అభిప్రాయమట. 

 

Anam Ramanarayanareddy planning to meet YS Jagan
Anam Ramanarayanareddy planning to meet YS Jagan

అయితే తొందరపడి ఏదో ఒకటి చేయకుండా అదును చూసి ఆగ్రహాన్ని వెళ్ళగక్కాలని చూస్తున్నారట.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ట్రై చేసినా ఆయనకు జగన్ ను కలిసే అవకాశం దొరకదు.  అందుకే తిరుపతి ఉప ఎన్నికలను  జగన్ ను కలవడానికి వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారట.  ఉప ఎన్నికల  దగ్గరపడితే జగన్ తప్పకుండా తిరుపతి లోక సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతారు.  ఆయనే లైన్లోకి వచ్చి మాట్లాడతారు.  ఆ సమయంలో తన బాధను, తన మీద జరుగుతున్న కుట్రలను  బయటపెట్టి న్యాయం చెప్పమని పట్టుబట్టాలనేది ఆనం వ్యూహమాట.