తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మంత్రి బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వస్తున్న మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల ఫలితాలు జగన్ సర్కార్ పాలనకు చిన్నపాటి గీటురాయి లాంటివని అనుకోవచ్చు. జగన్ పాలన ఎలా ఉందనే విషయం ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపోటముల మీద, మెజారిటీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ ఎన్నికలను వైఎస్ జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకే ఇప్పటి నుండే కసరత్తులు మొదలుపెట్టారు. లోక్ సభ పరిధిలోని అన్ని శక్తులను కూడదీసుకుంటున్నారు.
ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలైన సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్లారట సీఎం. నెల్లూరు, చిత్తూరుజిల్లాల్లో వైసీపీ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా నెల్లూరులో 10కి 10 ఎమ్మెల్యే స్థానాలు వైసీపీవే. కాబట్టి సాధారణంగా భయపడాల్సిన పని లేదు. కానీ ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే విషయంలో మాత్రం జగన్ కు కంగారు తప్పడం లేదట. అయనే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యాక చేసేది లేక కాస్త ఆలస్యంగా వైసీపీలోకి వచ్చారాయన. అందుకే జిల్లా రాజకీయాల్లో అంతగా చక్రం తిప్పలేకపోతున్నారు.
రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు ఆనం. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్ని శాసించిన కుటుంబం కావడంతో అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డిలు ఆధిపత్యాన్ని భరించలేకుండా ఉన్నారు. సొంత నియోజకవర్గంలో పనులు జరుపుకోలేక అసంతృప్తిలో ఉన్నారు. గతంలో కూడా జిల్లాలో రౌడీ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. కానీ ఆయన బాధను జగన్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆయన పార్టీని వీడతారనే ప్రచారం జరిగింది. కానీ ఆనం మాత్రం టైమ్ రాకపోతుందా అని ఎదురుచూశారు. ఆ టైమ్ తిరుపతి ఉప ఎన్నికల రూపంలో వచ్చింది. ఆయన అవసరం జగన్ కు ఉంది.
మంత్రి పదవి లేకపోయినా వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ఆయనకు మంచి పరిచయాలున్నాయి. అందుకే ఆయన మనసు పెట్టి పనిచేస్తే అభ్యర్థి ఎవరైనా ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించవచ్చు. జగన్ కు కావలసింది ఆ మెజారిటీనే. అందుకే రామనారయణరెడ్డి అవసరం ఉంది. ఇదే రామనారాయణరెడ్డికి అనందాన్ని ఇస్తోంది. ఇన్నాళ్లు పెద్దగా ప్రాముఖ్యత లేని తనకు టైమ్ వచ్చింది కాబట్టి ఏం చేయాలనుకున్నా ఇదే మంచి సమయమని, తడాఖా చూపాలని ఆయన భావిస్తున్నారట. మరి ఈ మంచి తరుణంలో ఆనం ఎంత గొప్పగా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.