ఆడాళ్లు బైడెన్ కు మగాళ్లు ట్రంప్ కు ఓటేశారు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి క్షణక్షణానికి ఉత్కంఠత పెరుగుతూవస్తోంది. అయితే ఈసారి ఓటింగ్ సరళి చాలా ఆసక్తికరంగా వ్యక్తం అవుతోంది. పురుషులు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపితే… మహిళా ఓటర్లు మాత్రం డెమొక్రాట్ అభ్యర్థి జోయి బైడెన్ వైపు ఆసక్తి కనబరిచారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపిన వివరాల ఆధారంగా.. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల సరళిని పరిశీలిస్తే…. మహిళా ఓటర్లలో 56  శాతం మంది బైడెన్‌కు ఓటేశారు. ఇక రెచ్చిపోయి మాట్లాడే ట్రంప్‌కు మహిళల నుంచి 43 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలను బాగా ఎంజాయ్ చేసిన  పురుష ఓటర్లు 49 శాతం మంది ఆయనకు ఓటేశారు. పురుష ఓటర్లను ఆకట్టుకోవడంలో ట్రంప్‌తో పోల్చితే బైడెన్‌ వెనకబడ్డారు.

మరోవైపు తెల్లజాతీయులు, నల్లజాతీయుల ఓట్లు పరిశీలిస్తే…తెల్లజాతీయులు ఎక్కువగా ట్రంప్‌కు ఓటేయగా.. నల్లజాతీయులు, ఆసియన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్లతో పాటు ఇతరులు బైడెన్‌ వైపు మొగ్గు చూపారు. నల్లజాతీయులైతే గంపగుత్తగా బైడెన్ కే ఓటేశారంట. నల్లజాతీయుల ఓట్లలో 87 శాతం బైడెన్ కు పడగా…తెల్లజాతీయుల ఓట్లలో 56 శాతం ట్రంప్ కు పడ్డాయంట.

ఇక వయసుల వారీగా పరిశీలిస్తే… అమెరికన్ యువత ట్రంప్ వైపు ఆసక్తి కనబర్చింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ఆధారంగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్.. ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. మరోవైపు ఈ ఇద్దరు…తమ సొంత రాష్ట్రాల్లో వెనకబడ్డారు. ట్రంప్ స్వరాష్ట్రం న్యూయార్క్ లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. జో బైడెన్ సొంత రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఎంతైనా లోకల్ ట్యాలెంట్ లోకల్ ట్యాలెంట్ ని రిజక్ట్ చేస్తుందని అమెరికాలో కూడా నిర్దారణ అయిపోయింది కదా.