సరిహద్దుల్లో మళ్ళీ అదే గందరగోళం. అంబులెన్సుల్లో రోగుల ప్రాణాలు ఆంక్షల కారణంగా గందరగోళంలో పడ్డాయి. ఆంధ్రపదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే అంబులెన్సుల్ని సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు ఆంక్షల పేరుతో. కోవిడ్ కంట్రోల్ సెంటర్ అలాగే తెలంగాణ పోలీసు విభాగం నుంచి అనుమతులు కావాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మేషన్ కూడా అవసరమే. బెడ్ కన్ఫర్మేషన్ వున్నా, ఈ-పాస్ వున్నా.. కోవిడ్ కంట్రోల్ సెంటర్ (ప్రత్యేక కాల్ సెంటర్) అనుమతి లేదంటూ అంబులెన్సుల్ని ఆపేశారంటూ సరిహద్దుల్లో ఏపీ నుంచి అంబులెన్సుల్లో తమవారిని తీసుకొస్తున్నవారు వాపోతున్నారు.
ఈ గందరగోళం నడుమ, ఇద్దరు కోవిడ్ రోగులు అంబులెన్సుల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇదెక్కడి వైపరీత్యం.? ప్రాణం కంటే ఏ నిబంధనా ఎక్కువ కాదు. వైద్యం పొందడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుగానే భావించాలి.. కరోనా రోగుల విషయంలో. ఎక్కడైనా వైద్యం పొందేందుకు వీలుగా కేంద్రమూ ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది. అయినాగానీ, ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క, అంబులెన్సులు తెలంగాణలోని ఆసుపత్రులన్నిటి చుట్టూ తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారన్న ఆరోపణల నడుమ, కొత్త నిబంధనల్ని తెరపైకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వ. నిజానికి, పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణలో అదుపులోనే వుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా, తెలంగాణలో కరోనా అదుపు చేయలేని స్థాయికి వెళ్ళిపోవచ్చన్న అనుమానాలున్నాయి. ఆ అనుమానాల నేపథ్యంలోనే ఆంక్షలు తెరపైకొచ్చాయని అనుకున్నా.. అంబులెన్సుల్ని ఆపడం సమర్థనీయం కాదు.