మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య సెటైరికల్ ట్వీట్లేస్తున్నారు. బహుశా ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది రాష్ట్రంలో నీటి పారుదల శాఖకు సంబంధించి కాదు, నోటి పారుదల శాఖకు సంబంధించి అయి వుంటుందన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించడానికి వైసీపీలో చాలామంది నాయకులున్నారు. మంత్రులు, రాజకీయ విమర్శలకు దూరంగా వుంటూ, పాలన మీద దృష్టిపెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ప్రభుత్వానికీ మేలు జరుగుతుంది, ప్రభుత్వాన్ని నడిపేవారికీ రాజకీయంగా ఉపయోగపడుతుంది.
‘అన్నాను.. అంటాను.. మళ్ళీ మళ్ళీ అంటాను.. అది వొళ్ళు బలిసినోళ్ళ పాదయాత్ర..’ అంటూ తాజాగా అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్ వేశారు. అంబటి విమర్శించింది అమరావతి రైతుల్ని. కాదు కాదు, అమరావతి రైతుల ముసుగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్ని.. అని వైసీపీ చెప్పడంలో వింతేముంది.?
అయితే, అంబటి రాంబాబు ట్వీటుని వైసీపీ మీదకే సంధిస్తున్నారు నెటిజనం. ‘అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రజా సంకల్ప యాత్ర చేయడం గురించేనా మీ విమర్శ.? అంటే, వైఎస్ జగన్ వొళ్ళు బలిసి పాదయాత్ర చేశారంటావ్.?’ అంటూ అంబటిని నెటిజనం నిలదీస్తున్నారు.
అక్కడితో ఆగడంలేదు, ‘తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తోంది ప్రజా ప్రస్థానం పేరుతో. ఆమెకీ వొళ్ళు బలిసి పాదయాత్ర చేస్తోందనే కదా మీ అభిప్రాయం..’ అంటూ అంబటిని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ నెటిజన్లలో మెజార్టీ తెలుగదేశం పార్టీ మద్దతుదారులేని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
‘వొళ్ళు బలిసి సంజన, సుకన్య దగ్గరకు వెళుతున్నది నువ్వు..’ అని కూడా అంబటి మీద సెటైర్లేస్తున్నారు నెటిజన్లు. అవసరమా ఈ తరహా పెంట.? మంత్రి పదవిలోకి వచ్చాక హుందాతనం ప్రదర్శించాల్సి వుంటుంది. అమరావతి రైతులు, టీడీపీ కనుసన్నల్లో ఉద్యమిస్తున్నదే నిజం కావొచ్చు. కానీ, వాళ్ళూ రాష్ట్ర ప్రజలే. అందునా, మహిళలు ముందుండి నడుపుతున్న ఉద్యమం అది.
మహిళా లోకంపై మంత్రిగా అంబటి రాంబాబు హుందాతనం ప్రదర్శించకపోతే ఎలా.? అది వైసీపీకే చేటు చేస్తుంది. అధినేత వైఎస్ జగన్ కూడా ఇలాంటి ‘వొళ్ళు బలిసిన ట్వీట్లను’ సమర్థించరు.