అమరావతి స్కాం ఇంకా ‘లైవ్’లోనే వుందట.!

Amaravati Scam : అమరావతి కుంభకోణం జరిగిందా.? జరగలేదా.? టీడీపీ హయాంలో చంద్రబాబు అండ్ కో ‘అమరావతి’ పేరుతో అడ్డంగా దోచుకున్నారన్నది వైసీపీ ఆరోపణ. గడచిన మూడేళ్ళ వైసీపీ పాలనలో, అర్థ రూపాయి కూడా దోపిడీ సొమ్ముని వెనక్కి తీసుకురాలేకపోయారు.. దోపిడీదారుల నుంచి. ఇదైతే వాస్తవం.

కేసులు పెట్టారు.. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి చీవాట్లు పడ్డాయి.. ప్రతిసారీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని తూలనాడటం, న్యాయస్థానాలపై అనుమానాలు వ్యక్తం చేయడం మినహా, ‘ఇదిగో ఇక్కడ దోపిడీ జరిగింది’ అని నిరూపించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో వైసీపీ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ఆ ఇన్‌సైడర్ ట్రేడింగ్ అన్న మాటకే అర్థం లేదని న్యాయస్థానాలు తేల్చి చెప్పేశాయి. అంటే, ఇక్కడ ప్రభుత్వం న్యాయస్థానాల్లో సరైన వాదన వినిపించలేకపోయిందన్నమాట. కానీ, మీడియాకెక్కి వైసీపీ నేతలు యాగీ చేయడంలో మాత్రం సమర్థత చాటుకుంటున్నారన్నమాట.

పదే పదే వీగిపోయిన అమరావతి స్కాం వ్యవహారానికి సంబంధించి తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిందని అనుకోవాలేమో. ఇలాంటి కేసుల వల్ల ప్రయోజనమేంటి.. ఆల్రెడీ గల్లంతైపోయిన టీడీపీకి జాకీలేసి లేపడం కాకపోతే.? అన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది.

ఇదిలా వుంటే, అమరావతి స్కాం వ్యవహారం ముగిసిన అధ్యాయం కాదనీ, అదింకా లైవ్‌లోనే వుందని వైసీపీ చెబుతోంది. లైవ్‌లో వుంది.. కానీ, నిరూపించలేని స్కామ్ ఇది.!