రాజధాని అమరావతికి సంబంధించి ‘పెద్ద కుంభకోణం’ జరిగిందనేది అధికార వైసీపీ ఆరోపణ. ఈ క్రమంలో మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు, సీఐడీ విచారణ.. ఇవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి కూడా. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని ఈ విచారణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ హయాంలో కుంభకోణం జరిగిన మాట వాస్తవమని చెబుతున్న వైసీపీ, ఎక్కడా అప్పట్లో టీడీపీతో కలిసి అధికారం పంచుకున్న బీజేపీ పేరుని ప్రస్తావించడంలేదు. చంద్రబాబు హయాంలో బీజేపీకి ఇద్దరు మంత్రులుండేవారు. కేంద్రంలోనూ టీడీపీ, బీజేపీతో అధికారం పంచుకుంది. ఆ సమయంలో ఇద్దరు టీడీపీ నేతలు కేంద్ర మంత్రులుగా పనిచేశారు.
అమరావతికి సంబంధించి ప్రతి విషయంలోనూ టీడీపీకి, బీజేపీ మద్దతిచ్చింది. ప్రత్యేక హోదా విషయంలో.. అదీ టీడీపీ – బీజేపీ నాలుగేళ్ళ ‘స్నేహం’ తర్వాత, బీజేపీకి దూరమయ్యింది టీడీపీ. చంద్రబాబు ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు రావడం, మోడీ ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు రావడం అప్పుడే జరిగాయి. కాగా, అమరావతి విషయంలో బీజేపీ సూచనల్ని టీడీపీ పెడచెవిన పెట్టిందంటూ బీజేపీ నేతలు ‘తప్పించుకునే ధోరణిలో’ బుకాయిస్తున్నారు. నిజానికి, అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ధారించే క్రమంలో వైసీపీ కూడా, టీడీపీకి మద్దతివ్వక తప్పలేదు. పెద్దయెత్తున భూములు రాజధానికి కావాలని అడిగింది కూడా వైసీపీనే. రాష్ట్రానికి మధ్యలో రాజధాని వుండాలని కూడా వైసీపీ కోరింది. ఈ విషయాల్ని టీడీపీ పదే పదే గుర్తు చేస్తుంటుంది. అయితే, భూముల కుంభకోణం అనేది ఇక్కడ కీలకమైన విషయం.
టీడీపీ, బీజేపీ నేతలే కాదు కొందరు వైసీపీ నేతలు కూడా, టీడీపీతో కుమ్మక్కయి తమ బినామీలతో అమరావతిలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. వాటన్నిటి నిగ్గు తేలాలంటూ, విచారణ నిష్పాక్షికంగా జరగాలి. ‘మాకేంటి సంబంధం.?’ అని బీజేపీ తప్పించుకుంటున్నా, పస లేని కేసులు పెట్టి రాజకీయ లబ్దికి వైసీపీ ప్రయత్నిస్తున్నా.. ఇవేవీ రాష్ట్ర భవిష్యత్తుకి మేలు చేసేవి కావు. వివాదాలు పక్కన పెట్టి, ముందంటూ రాష్ట్రానికి ఓ సరైన రాజధాని అవసరమన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలూ గుర్తెరగాలి.