ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతిలో స్కామ్ జరిగింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, అత్యంత వ్యూహాత్మకంగా తాను అధికారంలో వున్న సమయంలో, అమరావతిని ‘పసుపు దళానికి’ ప్రధాన ఆదాయ వనరుగా మార్చేశారన్న విమర్శలున్నాయి.
మాజీ రాష్ట్ర మంత్రి నారాయణ, పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి.. ఇలా చాలా పేర్లు వినిపించాయి.చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ సంస్థ.. అలాగే, బాలకృష్ణ చిన్నల్లుడి కుటుంబ సభ్యులు.. ఇలా చాలామంది అమరావతి మీద పడి దోచేశారన్నది గత కొంతకాలంగా వైసీపీ చేస్తోన్న ఆరోపణ. అయితే, ఆ ఆరోపణలకు సంబంధించి ఇప్పటిదాకా సరైన ఆధారాల్ని సేకరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైనమాట వాస్తవం.
కానీ, ఈసారి మాత్రం టార్గెట్ పక్కాగా వుందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పూర్తి ఆధారాలు తమ వద్ద వున్నాయనీ చెబుతున్నారు వైసీపీ నేతలు. అసైన్డ్ భూములకు సంబంధించిన కుంభకోణంలో టీడీపీ అడ్డంగా ఇరుక్కుపోయిందన్నది వైసీపీ ఆరోపణ. ‘రెండేళ్ళ పాలనలో వైఎస్ జగన్ ఏం పీకారు.?’ అంటూ ఒకింత స్థాయిని మరచి చంద్రబాబు కొన్నాళ్ళ క్రితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
మరి, దానికి బదులు తీర్చుకోవడానికి వైఎస్ జగన్ సర్కార్ సమాయత్తమవుతోందా.? వైసీపీ చెబుతున్నట్లు అమరావతిలో ల్యాండ్ స్కాంకి సంబంధించి టీడీపీని ఈసారి ఎలాంటి పొరపాటూ లేకుండా ఇరికించగలుగుతుందా.? ఇరికిస్తే మాత్రం, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదో పెను సంచలనమవుతుంది.
లేదూ, ప్రతిసారిలానే ఈసారి కూడా పసలేని కేసులు పెట్టి, ఆ తర్వాత ‘చంద్రబాబు అండ్ టీమ్.. వ్యవస్థల్ని మేనేజ్ చేసింది..’ అని వైసీపీ సర్కార్ చేతులు దులుపుకుంటుందా.? వేచి చూడాలిక.