రాజధాని అమరావతికి సంబంధించి నమోదైన కేసుల విచారణను హైకోర్టు నవంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. నేటి నుంచి రోజువారీ విచారణ అమరావతికి సంబంధించి జరుగుతుందనే ప్రచారం జరిగింది. దేశంలో, రాష్ట్రంలో కరోనా ప్రభావం నేపథ్యంలో పిటిషనర్లు, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, కేసు విచారణ విషయమై హైకోర్టు సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సైతం, ఈ విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దాంతో, విచారణను నవంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. ఆ తర్వాతే రోజువారీ విచారణ జరిగే అవకాశం వుంది. రాధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకీ, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులకు సిద్ధమైన ప్రభుత్వానికీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తూ వస్తోంది గత కొంతకాలంగా.
మూడు రాజధానులతో తమకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మరోపక్క, ఎవరికీ అన్యాయం చెయ్యబోమని ప్రభుత్వం అంటోంది. మూడు రాజధానుల దిశగా అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం పాస్ చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. గవర్నర్ ఆమోదంతో అతి చట్ట రూపం కూడా దాల్చింది. అయితే, మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టు స్టేటస్ కో విధించిన విషయం విదితమే. దాంతో, మొత్తంగా మూడు రాజధానుల అంశం త్రిశంకు స్వర్గంలో వేలాడుతోందిప్పుడు. పోనీ, అమరావతిని అయినా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందా.? అంటే అదీ లేదు. 2024 ఎన్నికల నాటికైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై గందరగోళం ఓ కొలిక్కి వస్తుందా.? అంటే, అదీ అనుమానమే.