అమరావతి రైతులు చేస్తోన్నది అతి ఖరీదైన పాదయాత్ర.!

అమరావతి రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ చేపట్టిన మహా పాదయాత్రకు సంబంధించి రోజుకో కొత్త వివాదం తెరపైకొస్తోంది. న్యాయస్థానం కొన్ని షరతులు విధించి, మహా పాదయాత్రకు అనుమతినిచ్చిన విషయం విదితమే. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం, ఈ పాదయాత్రకు అనుమతినివ్వలేదు.

కోర్టు పెట్టిన షరతుల్ని అమరావతి పరిరక్షణ సమితి తు.చ. తప్పకుండా పాటించాల్సి వుంది. అయితే, ఆ షరతుల్ని ఉల్లంఘించి అధిక సంఖ్యలో జనం ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారన్నది పోలీసుల వెర్షన్. పాదయాత్ర చేస్తున్నది కొంతమందేననీ, ఆ పాదయాత్రకు సంఘీభావంగా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారన్నది అమరావతి పరిరక్షణ సమితి వాదన.

ఎవరి వాదనలెలా వున్నా, అసలు ఇంత ఖరీదైన పాదయాత్రకు నిధులు ఎలా వస్తున్నాయ్.? అన్నది ఇంకో ప్రశ్న. 150 మందికి పైగా రైతులు పాదయాత్ర చేస్తున్నారు. వారికి వసతి సౌకర్యం వంటివి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతమంది విరాళాలు ఇస్తున్నా, ఆ విరాళాలు నిజమైనవేనా.? ఎవరైనా తెరవెనుకాల స్పాన్సర్ (రాజకీయంగా) చేస్తున్నారా.? అన్న దిశగా అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇందులో అనుమానమేమీ లేదు, పూర్తిగా టీడీపీనే ఈ యాత్ర కోసం ఖర్చు చేస్తోందన్న వాదనలూ లేకపోలేదు. కాగా, పాదయాత్రలో పాల్గొంటున్నవారికి సంబంధించి కూపీ లాగుతున్న నెటిజన్లు, కోట్లకు అధిపతులైన వారు పేద రైతుల ముసుగులో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారంటూ ‘గాలి’ తీసేస్తున్నారు.

ఒక్కటి మాత్రం నిజం.. అమరావతి పేరుతో అక్కడి రైతులకు అన్యాయం జరిగింది. చంద్రబాబు హయాంలో మొదలైన ఈ అన్యాయం అలా అలా కొనసాగుతూనే వుంది. వారిని కొన్ని రాజకీయ శక్తులు తమ అవసరానికి వాడుకుంటున్నాయి.