జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు గెలుపు గుర్రాల వేటలో పార్టీలు… తెరాస వ్యూహాలు మారుస్తుందా?

all the parties are strongly planning for ghmc electionns

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో రాజకీయ రణరంగంలోకి దిగేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. నువ్వా నేనా అనే రీతిలో తలపడేందుకు రాష్ట్ర రాజధాని వేదికైంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న కీలకమైన ఎన్నికల కావడంతో అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ సైతం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసిన కాషాయదళం కారు జోరుకు సవాలు విసురుతోంది. మరోవైపు వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకునే పరిస్థితి నెలకొంది. ఇక టీఆర్‌ఎస్‌-ఎంఐఎం జోడీ మరోసారి గ్రేటర్‌ పీఠంపై కన్నేసింది.

all the parties are strongly planning for ghmc electionns
all the parties are strongly planning for ghmc electionns

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో మంగళవారం ప్రధాన పార్టీల నేతలంతా సమావేశం అయ్యారు. విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇక గ్రేటర్‌‌లో తన పట్టును నిలుపుకోవాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే నగర ఓటర్లను ఆకర్షించుకునేందుకు మేనిఫెస్టోను సిద్ధం చేసింది. 21న కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేయనుంది. అలాగే రానున్న రెండు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇప్పటికే తుది జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. పార్టీ ముఖ్యనేతలు రేవంత్‌ రెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమై ఉన్నారు.

దుబ్బాక ఇచ్చిన విజయంతో మంచి ఊపుమీద ఉన్న కాషాయదళం… గ్రేటర్‌లోనూ కారుకు షాకివ్వాలని ఉవ్విళ్లూరుతోంది. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యనేతలను రంగంలోకి దింపి.. కమిటీల వారిగా ప్రచారం చేపడుతోంది. బిహార్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ ముఖ్యనేత భూపేంద్ర యాదవ్‌ను గ్రేటర్‌ పరిశీలకునిగా నియమించి.. నేతలకు దిశానిర్ధేశం చేయాలని బీజేపీ నిర్ణయించింది. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాలకు బీజేపీ ఇన్‌ఛార్జుల నియామించింది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల బాధ్యత ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

ఇక రాజధానిలో జరిగే ఎన్నికల్లో గెలిచి పోయిన పరువుని కూడా గెలవాలని అధికార టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధిష్టానం.. విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సంక్షేమ పథకాల అమలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల అప్పగింత వంటి కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే తొలి జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.