కేసీఆర్ ఆశలన్నీ “డ్రైనేజీ” పాలు

kcr telugu rajyam

 2020 GHMC ఎన్నికల్లో తెరాసకు మొన్నటి వరదలే ప్రధాన ప్రతిపక్షంగా మారిపోయాయి. రంగు రంగుల దీపాలు, మొక్కలు చూపించి ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకున్న కేసీఆర్ కు వరదలు తమ ప్రభుత్వం యొక్క అసలు రంగును బయటపెట్టేసరికి ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోవటం లేదు. హైదరాబాద్ అభివృద్ధి కోసం 50 వేల కోట్లు, 60 వేల కోట్లు ఖర్చుపెట్టాం. ప్రపంచంలోనే బెస్ట్ సిటీ గా హైదరాబాద్ ని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వానికి బంగాళాఖాతంలో పుట్టిన వాయుగుండం గట్టి దెబ్బ కొట్టింది.

cm kcr telugu rajyam

  ఇదే సమయంలో కేసీఆర్ కొత్తగా నిర్మించబోతున్న సచివాలయం గురించి ప్రతిపక్షాలే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా విమర్శలు చెస్తుంది. అమ్మకు అన్నం పెట్టలేని వాడు..పిన్నమ్మ కు బంగారు గాజులు చేయించాడు అన్నట్లు, సామాన్య ప్రజలు జీవించటానికి సరైన వసతులు కలిగించలేని సీఎం, పరిపాలన సౌలభ్యం కోసమంటూ వందల కోట్లు ఖర్చుపెట్టి ఏడంతస్తుల మేడలు మాత్రం కట్టుకుంటున్నాడు. గట్టి వర్షం పడితే ప్రజలను రక్షించలేని సీఎం, తనని తాను కాపాడుకోవటం కోసం ఏకంగా ఒక బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మేడను నిర్మించుకోవటం ఏంటి అనే మాటలు వినవస్తున్నాయి. పాత భవనం మరో 50 ఏళ్లయినా సరే చెక్కుచెదరకుండా ఉంటుందని నిపుణులు చెప్పిన కానీ, వాటిని లెక్కచేయకుండా కొత్త సచివాలయం నిర్మిస్తున్న కేసీఆర్ కి, చిన్న వర్షం పడిన మునిగిపోతున్న హైదరాబాద్ గుర్తుకురాకపోవటం విచారకరం.

hyderabad floods in telugu rajyam

 ఇప్పటికే అనేకసార్లు హైదరాబాద్ మహానగరం వర్షాల దెబ్బకి కకావికలం అయ్యింది. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. వందేళ్ల క్రితం నిజాం నిర్మించిన డ్రైనేజీనే నేడు చిన్న చిన్న మార్పులు చేసి వాడుతున్నారు తప్ప కొత్తగా చేసింది ఏమి లేదు. అప్పటి జనాభాకి ఇప్పుడు పెరుగుతున్న జనాభాకి అసలు పోలిక లేదు. వందల సంఖ్యలో కొత్త వీధులు పుట్టుకొని వచ్చాయి. లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరిగింది. వాటికీ సరిపోయే డ్రైనేజి వ్యవస్థ మాత్రం సరిగ్గా లేదు. గతంలో సరికొత్త డ్రైనేజీ వ్యవస్థ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 12 వేల కోట్లు రూపాయలు ఖర్చు అవుతుందని నివేదికలు వచ్చాయి. దానిని అమలుచేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది.

ఏదైనా అడిగితే అది అసాధ్యం, సిటీలో అనుకున్నంత ఈజీ కాదంటూ తెరాస నాయకత్వం తప్పించుకొని తిరుగుతుంది. గోదావరి నీటిని కృష్ణ నదికి చేర్చిన అపర భగీరధుడు కేసీఆర్ అని గొప్పలు చెపుతున్నారే , అలాంటి భగీరదుడికి 12 వేల కోట్లు ఖర్చుపెట్టి సరికొత్త డ్రైనేజీ వ్యవస్థ నిర్మించటం కష్టమా..? నిధులుకు వచ్చిన కొరతేమి లేదుగా..తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నుండే 70 % పైగా ఆదాయం వస్తుంది. అయినా సరే అభివృద్ధి మాత్రం ఆమడదూరంలో ఉంటుంది. ఇప్పటికైనా మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసిందే