ఏపీలో పదవ తరగతి పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో జరిపి తీరతామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఒక పక్కన పరీక్షలు రద్దు చేయాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లి దండ్రులు నిరసన తెలియచేస్తున్న వేళ మంత్రి చేసిన వ్యాఖ్యలతో అందరూ అయోమయంలో పడిపోయారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్తో కలిసి మంత్రి సురేష్ మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మంత్రిగారు మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్ ప్రభావం తగ్గాక పది పరీక్షలు నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షల నిర్వహణపై సముఖంగా లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ… పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం లేదని ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి అన్నారు. ఎవరెన్ని చేసినా పరీక్షలు నిర్వహించి తీరుతామని గట్టిగా బదులిచ్చారు. ఉన్నత చదువులకి , ఉద్యోగాలకి టెన్త్ మార్కులే ప్రామాణమని, కనుక ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసేది లేదన్నట్లుగా మాట్లాడారు.
ముఖ్యమంత్రి జగన్ గారు కూడా విద్యార్థుల ఆరోగ్య భద్రతకి ప్రాధాన్యమిచ్చి తగు జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు జరపాలనే ఆలోచనలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి కోర్టు ఆదేశాలతో వాయిదా వేశామని , కానీ పరీక్షలు మాత్రం నిర్వహిస్తామన్నారు. ఈ విషయంలో విశ్లేషకుల నుండి విముఖత వ్యక్తమవుతుండటం గమనార్హం. విద్యార్థుల జీవితాలని పణంగా పెట్టి పరీక్షలు నిర్వహిస్తే పొరపాటున జరగరానిది జరిగితే భవిష్యత్ ఎవరికి ఉంటుందని రకరకాలుగా ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జూన్ 30కి వాయిదా పడింది. ఆ రోజే పది పరీక్షల వ్యవహారంలో జగన్ ప్రభుత్వ పంతం నెగ్గుతుందా లేదా అనేది తేలిపోతుంది.