‘మా’ ఎన్నికల రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించడంలేదు. ఎన్నికల పలితాలపై ఎన్నికల అధికారి వివరణ ఇచ్చినా, వివాదం కొనసాగుతూనే వుంది. ‘మేం గెలిచాం.. కానీ, ఓడిపోయాం.. రాత్రికి గెలిచినా, మరుసటి రోజు వచ్చేసరికి ఓడిపోయాం.. మధ్యలో ఏం జరిగిందో ఆ కనక దుర్గమ్మకైనా తెలుసో లేదో..’ అంటూ సినీ నటి హేమ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి సినీ పరిశ్రమలో.
ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యాక అసలు ఫలితాల్ని వెల్లడించామనీ, ఈలోగా మీడియాలో వచ్చిన వార్తలతో తమకేంటి సంబంధం అనీ ఎన్నికల అధికారి పేర్కొన్న విషయం విదితమే. అయితే, కౌంటింగ్ కేంద్రం నుంచి వచ్చిన సమాచారంతో తొలుత అనసూయ భరద్వాజ్ అత్యధిక మెజార్టీ దక్కించుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ మరుసటి రోజు అనసూయ ఓడిపోయినట్లుగా తేల్చారు.
మంచు విష్ణు ప్యానల్ ఈ ఎన్నికల్లో విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి ప్యానెల్ అయిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ తదితరులు విజయం సాధించిన విషయం విదితమే. అయితే, చివరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యాయనీ నైతిక విజయం తమదేననీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు చెబుతున్నారు.
కాగా, మంచు విష్ణు నిన్నే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవారు మాత్రం, తమ పదవులకు ఇప్పటికే రాజీనామా చేశారు, ఆ రాజీనామాలు ఆమోదం పొందాల్సి వుంది.