‎Fish Venkat: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

‎Fish Venkat: తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ తాజాగా తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఫిష్ వెంకట్ పరిస్థితి ఈ మధ్యకాలంలో మరింత విషమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని కొంతమంది సెలబ్రిటీలు సహాయం చేసిన విషయం తెలిసిందే.

‎అయితే ఆయన రెండు కిడ్నీలూ డ్యామేజ్‌ కావడంతో డయాలసిస్‌ కోసం కొన్ని రోజుల క్రితం బోడుప్పల్‌ లోని ఒక ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అయితే రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు చెప్పినట్లు ఆయన కుమార్తె ఇటీవల తెలిపారు. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సహాయం చేయాలంటూ వేడుకున్నారు. అయితే కొంతమంది సెలబ్రెటీలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించినప్పటికీ ఫిష్ వెంకట్ ప్రాణాలు కోల్పోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి.

‎ ఫిష్‌ వెంకట్‌ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆయన మరణంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కోట శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధ నుంచి ఇంకా కోలుకోక ముందే తాజాగా మరో నటుడు మరణించడం అన్నది నిజంగా బాధాకరం అని చెప్పాలి. ఇప్పటికే ఆయన మరణ వార్త గురించి తెలుసుకున్న పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఫిష్‌ వెంకట్‌ అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్‌ కాగా ముషీరాబాద్‌ మార్కెట్‌లో చేపల వ్యాపారంతో ఫిష్‌ వెంకట్‌ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముషీరాబాద్‌ లో నివాసం ఉంటున్న ఆయన నటుడు శ్రీహరి ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ ఆయన్ను నటుడిగా పరిచయం చేశారు. ఫిష్‌ వెంకట్‌ వందకు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినీప్రియులను అలరించారు.