Actor Ali : సినీ నటుడు అలీకి శుభవార్త దాదాపు ఖాయమైపోయింది. అతి త్వరలో పార్టీ నుంచి కీలక ప్రకటన రాబోతోందంటూ నటుడు అలీ తాజాగా ప్రకటించారు. ఆ శుభవార్తను ఖరారు చేసుకునేందుకుగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఈ రోజు అలీ భేటీ అయ్యారు.
అయితే, భేటీ మర్యాదపూర్వకమేననీ, భేటీ సందర్భంగా అనేక అంశాలు చర్చకు వచ్చాయనీ అలీ చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకు చాలాకాలంగా పరిచయం వుందనీ, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశాననీ, అయితే ఏనాడూ తాను పదవుల గురించి ఆలోచించలేదనీ అలీ చెప్పారు.
గతంలోనే తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని వైఎస్ జగన్ ప్రతిపాదించినప్పటికీ, సమయాభావం కారణంగా తాను పోటీ చేయలేకపోయాననీ, ఫేమ్ వుంది కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసెయ్యాలన్న ఆలోచన తనకు లేదనీ, ప్రజల్లోకి వెళ్ళి, వారి సమస్యలు తెలుసుకుని, నాయకుడిగా ఎదగాలన్నదే తన ఉద్దేశ్యమనీ అలీ అన్నారు.
జనంలోకి వెళ్ళి నాయకుడవ్వాలనుకుంటున్నప్పుడు రాజ్యసభకు ఎంపికవడం దేనికి.? వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గం నుంచో, లోక్ సభ నియోజకవర్గం నుంచో పోటీ చేయొచ్చు కదా.? అన్న ప్రశ్న అలీ వైపు దూసుకెళుతోంది.
ఇదిలా వుంటే, ఎమ్మెల్సీగా అలీకి అవకాశమిచ్చి, ఆయన్ని మంత్రిగా చేయాలని కూడా ఓ ప్రతిపాదన వచ్చినప్పటికీ, రాజ్యసభకు ఆయన్ని పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిక్స్ అయ్యారని అంటున్నారు.