తెలుగుదేశం పార్టీ కథ ముగిసిందంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో చాలా బిజీగా వున్న టీడీపీ అధినేత చంద్రబాబుకి ఇది నిజంగానే పెద్ద షాక్. ఓ వీడియో టేపులో అచ్చెన్నాయుడు, టీడీపీ మద్దతుదారుడైన ఓ వ్యక్తితో మాట్లాడుతున్న వైనం టీడీపీ వర్గాల్ని కూడా అయోమయంలో పడేసింది. ఆ వీడియో టేపులో ఓ వ్యక్తి, అచ్చెన్నాయుడితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద ఫిర్యాదు చేస్తున్నట్టుగా వుంది. తనను లోకేష్ గౌరవించడంలేదంటూ, దూషణలకు దిగాడు.
తాను కోట్లాది రూపాయలు ఇచ్చాననీ, దానికి సమాధానం చెప్పడంలేదని ఆరోపించాడు. 1200 కోట్ల రూపాయలు.. కెఎల్ నారాయణ.. ప్రాజెక్టు.. ఇలాంటి ప్రస్తావనలు ఆ వీడియో టేపులో వున్నాయి. అంతేనా, టీడీపీ పనైపోయిందని సదరు నేత వ్యాఖ్యానిస్తే, ‘పార్టీ లేదు.. డాష్ లేదు..’ అంటూ అచ్చెన్న వ్యాఖ్యనించడం కూడా ఆ వీడియో టేపులో వుంది. ఇదెంతవరకు నమ్మదగిన వీడియో టేపు.? అన్నది పక్కన పెడితే, టీడీపీలో ప్రస్తుత పరిస్థితిని ఈ వీడియో టేపు తేటతెల్లం చేసిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. నిన్ననే చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు రువ్విన ఘటతో టీడీపీకి కాస్త ఊపు వచ్చిందని తెలుగు తమ్ముళ్ళు కొంత సంబరపడుతున్నారు. ఇంతలోనే ఈ వీడియో టేపు, తెలుగుదేశం పార్టీ వర్గాల్ని పూర్తిస్థాయిలో అయోమయంలోకి నెట్టేసింది. అచ్చెన్నకు సంబంధించి ఓ ఆడియో టేపు గతంలో.. అంటే, పంచాయితీ ఎన్నికల సమయంలో బయటకొచ్చింది. ఆ ఆడియో టేపు, తదనంతర పరిణామాలతో అచ్చెన్న అరెస్టయ్యారు కూడా. ఇప్పుడు ఈ వీడియో టేపు కూడా అచ్చెన్న టార్గెట్‌గా బయటకు రావడం వెనుక అసలు కారణం ఏమై వుంటుందబ్బా.?