టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ అచ్చెన్న కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా సర్కార్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. అచ్చెన్న అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేయించారని, దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో అచ్చెన్నాయుడిని బాహుబలితో పోల్చి మాట్లాడారు. ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు బాహుబలిలో ఢీకొట్టారని లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు వైకాపా మంత్రి వెల్లంపల్లి కౌంటర్లు వేసారు. అచ్చెన్న బాహుబలి కాదు..ఆ సినిమాలో నల్లగా మసిరంగు పూసుకుని కనిపించే కాలకేయలాంటోడని ఎద్దేవా చేసారు.
నిలువుగా, అడ్డంగా ఎలా పడితే అలా పెరిగిన వారు బాహుబలి ఎలా అవుతారని? అసలు బాహుబలి గురించి లోకేష్ కు ఆ సినిమా చూసిన తర్వాతే తెలిసి ఉంటుందన్నారు. అధికారంలో ఉన్నంత కాలం పేదల రక్తం తాగిన మంత్రిగా అచ్చెన్న రికార్డు గురించి చెప్పలేమన్నారు. అసలైన బాహుబలి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. లోకేష్ ని కూడా మిగతా తెలుగు దేశం నేతలంతా పరామర్శిం చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు. మంగళగిరిని మందలగిరి అని, జయంతిని వర్ధంతని తేడా తెలియకుండా మాట్లాడే లోకేష్ రాజకీయాలు చేయడం హాస్యాస్పందంగా ఉందన్నారు. హత్యా రాజకీయాలు చేయడం టీడీపీకే చెల్లిందన్నారు. వంగవీటి మోహనరంగను నడిరోడ్డు పై చంపింది ఎవరు? అని ప్రశ్నించారు.
తేదాపా అధికారంలో ఉన్నప్పుడు రంగను మట్టుబెట్టలేదా? అని నిలదీసారు. హత్యా రాజకీయాలకు పేరు గడించింది నారా చంద్రబాబు నాయుడు కాదా అని మండిపడ్డారు. ఇకనైనా వాస్తవాలు గ్రహించి రాజకీయాలు చేయాలని హితవు పలికారు. ప్రస్తుతం తమ పార్టీ పరిస్థితి ఎలా ఉందో? భవిష్యత్ లో ఆ పార్టీ ఉంటుందో? ఊడుతుందో కూడా తెలియదని ఎద్దేవా చేసారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.