ప్రమాదం ఎప్పుడు ఈ రూపంలో సంభవిస్తుందో ఎవరు అంచనా వేయలేరు . ప్రతిరోజు దేశంలో ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల బీహార్ లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంలో కూడా పలువురు మృతి చెందగా… చాలామంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ పొట్టకూటి కోసం కూలీలుగా పని చేసే వారు. సోన్ నదిలో ప్రయాణిస్తున్న పడవలో ఆహారం వండుతున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాలలోకి వెళితే… పాట్నా జిల్లాలోని హల్దీ ఛప్రా గ్రామానికి చెందిన కూలీలు కోయిల్వార్-బిహ్తా ప్రాంతం నుంచి ఇసుక తవ్వి జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో కూలీలు సోన్ నదిలో పడవలో ప్రయాణిస్తూ వంట చేసుకుంటున్న సమయంలో బీహార్‌లోని పాట్నా జిల్లా మానేర్ సమీపంలో పడవలో గ్యాస్ సిలిండర్ పేలి 5 మంది కూలీలు మృతి చెందారు. అంతేకాకుండా చాలామంది కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు పడవలో నదిలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని ఈ ఘటనలో మృతి చెందిన వారి మతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటనలో గాయపడిన కూలీలను వేరే పడవలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటన జరిగిన సమయంలో పడవలో మొత్తం 20 మంది కూలీలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. 20 మంది కూలీలు హల్దీ ఛప్రా గ్రామానికి చెందినవారు. ఓకే గ్రామానికి చెందిన ఐదుగురు మరణించడంతోపాటు అనేకమంది గాయపడటంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.