ఏబీవీ వర్సెస్ ఏపీ ప్రభుత్వం: గెలిచేదెవరు.?

తెలుగుదేశం పార్టీ హయాంలో.. అంటే, 2014 నుంచి 2019 వరకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హవా నడిచింది. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేయించుకున్నారు ఏబీ వెంకటేశ్వరరావు. ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా పనిచేసిన ఏబీవీ, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారన్న విమర్శల్ని ఎదుర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మొత్తం అప్పట్లో ఏబీవీ కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలూ వెల్లువెత్తాయి. అదంతా గతం. ప్రస్తుతం ఏబీవీ, ఉద్యోగం లేక ఖాళీగా వున్నారు. అధికారంలోకి వస్తూనే, ఏబీవీని పక్కన పెట్టారు వైఎస్ జగన్. అక్కడినుంచి వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతూనే వుంది. ఏబీవీ మీద తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలున్నాయి. దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా ఏబీవీ కొన్ని పరికరాల కొనుగోలుకు తెరలేపారనీ, అది కూడా తన కుమారుడి సంస్థకు లాభం చేకూర్చేలా వ్యవహరించారనీ ఆయన మీద అభియోగాలు మోపింది వైఎస్ జగన్ సర్కార్.

తాజాగా, ఆయన్ని డిస్మిస్ చేయాలని కూడా కేంద్రానికి లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం. ఈ లేఖ వ్యవహారంపై ఏబీవీ సీరియస్ అయ్యారు. కక్ష పూరిత రాజకీయాల్లో భాగంగానే తనపై నిందారోపణలు చేస్తున్నారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు కోర్టుకు కూడా విన్నవించుకున్నారు ఏబీవీ. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఏబీవీకి ధీటుగా అటు న్యాయస్థానాల్లోనూ, ఇటు కేంద్రం వద్దా సమాధానమిస్తోంది. ఏపీ వాదన నెగ్గితే, ఏబీ వెంకటేశ్వరరావు డిస్మిస్ అవడం ఖాయమే. కానీ, అదంత తేలికైన వ్యవహారం కాదు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన. ఆయన గనుక, ఈ వ్యవహారంలో జగన్ సర్కారుపై విజయం సాధిస్తే.. అంతకన్నా అవమానకరమైన విషయం అధికార వైసీపీకి ఇంకోటుండదు. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికీ, ఓ రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య వైరంలా మారిపోయిందిది.