YSRCP Wickets Going Down : ‘పని తీరు మెరుగుపరచుకోకపోతే కష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే పరిస్థితే లేదు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోలేని ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు ఇవ్వబోం..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న నిర్వహించిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా, తమ పార్టీ ప్రజా ప్రతినిథుల విషయంలో ఇలాంటి హెచ్చరికలే చెయ్యాలి కూడా.! లేదంటే, పార్టీ ఇంకోసారి అధికారంలోకి వచ్చే అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. అయితే, వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత వున్నా, ఎమ్మెల్యేల విషయంలోనే అస్సలేమాత్రం సానుకూలత కన్పించడంలేదు రాష్ట్రంలోని మెజార్టీ నియోజకవర్గాల్లో. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు నివేదికలు అందుతూనే వున్నాయి.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు.. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. కారణమేంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు పబ్లిసిటీ కార్యక్రమాలకు తప్ప, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో కనిపించడంలేదన్న విమర్శ వుంది. ఈ విషయమై పార్టీకి చెందిన కింది స్థాయి నేతలు కొందరు ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి మరీ అధినేత దృష్టికి మీడియా ద్వారా తమ ఆవేదన వెల్లగక్కుతున్నారు. నిజానికి, అలా సాహసించడం చాలా అరుదు.. కింది స్థాయి నేతలు.
పరిస్థితి మరీ దారుణంగా వుంటేనే.. ఇలా సొంత పార్టీ ప్రజా ప్రతినిథులపై పార్టీ శ్రేణులు నిరసన తెలుపుతాయి. అన్నట్టు, సాధారణ ఎమ్మెల్యేలే కాదు, మంత్రుల విషయంలో కూడా ఇదే అసంతృప్తి పార్టీ కార్యకర్తల్లోనే కనిపిస్తోంటే, ముఖ్యమంత్రి హెచ్చరికలు చేయకుండా వుంటారా.?
పద్ధతి మార్చుకోకపోతే 50 శాతం మంది ఎమ్మెల్యేలు కాదు, అంతకు మించి.. అంటే, 75 శాతానికి పైగా ఎమ్మెల్యేలపై వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల పరంగా వేటు పడే అవకాశాలైతే వున్నాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ.