చిన్నారి మృతి కేసులో కట్టుకథతో మాయ చేసిన కన్న తల్లి.. !

నవ మాసాలు మోసి కని అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలని కొట్టటానికి కూడా తల్లి తండ్రులు బాధ పడతారు. అలాంటిది కొందరు మాత్రం కని,పెంచిన పిల్లలను వారి చేతులతోనే హతమర్చుతున్నారు. తాజాగా ఇటువంటి దారుణమైన సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. 12 నెలల పసికందును కన్నతల్లి కనికరం లేకుండా నీటి సంపులో పడేసి ప్రాణాలు తీసింది. ఈ ఘటనతో జనగామలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన కడుపున పుట్టిన కూతురు అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని పెరిగి పెద్దయిన తర్వాత భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ఆ తల్లి కఠినాత్మురాలిగా మారి అభం శుభం తెలియని పసికందు ప్రాణాలను తీసింది.

వివరాల్లోకి వెళితే… జనగామ జిల్లా అంబేద్కర్ నగర్ లో నివాసం ఉండే భాస్కర్, ప్రసన్న దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె. భాస్కర్ పని నిమిత్తం బయటికి వెళ్ళగా సోమవారం ప్రసన్న తన 12 నెలల కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉంది. అయితే ఆ సమయంలో ఒక దొంగ ఇంట్లోకి చోరబడి చైన్ స్నాచింగ్ కి ప్రయత్నించి తను ప్రతిఘటించడంతో తన కూతురుని సంపులో పడేసి వెళ్ళాడని గట్టిగా కేకలు వేయటంతో స్థానికులు అక్కడికి చేరుకొని సంపులో పడిన చిన్నారిని బయటికి తీశారు. సమాచారం అందుకున్న భాస్కర్ హుటాహుటిన ఇంటికి చేరుకొని చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో ఈ ఘటన గురించి చిన్నారి తల్లి ప్రసన్న ను పోలీసులు విచారించగా… ప్రసన్న చెప్పిన సమాధానాలు పొంతన లేకపోవడంతో పోలీసులకి అనుమానం కలిగింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో ప్రసన్నను విచారించగా అసలు విషయం బయట పెట్టింది. తన కూతుర్ని తానే సంపులో పడేసి చైన్ స్నాచర్ పడేసినట్లుగా కట్టుకథ అల్లినట్లు అంగీకరించింది. అయితే చిన్నారిని చంపడానికి గల కారణం ఏంటని పోలీసులు ప్రశ్నించగా.. తమకి జన్మించిన ఇద్దరు పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని , ఇటీవలే 8 లక్షల ఖర్చు చేసి కుమారుడికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించామని ప్రసన్న వెల్లడించింది.

అంతే కాకుండా ఏడాది వయసున్న చిన్నారి తేజస్వి కూడా కదలలేని స్థితిలో ఉంది. తనకి పుట్టిన ఇద్దరు పిల్లలు ఇలా అనారోగ్యంతో బాధపడటం చూడలేకపోయిన ప్రసన్న వారు పెరిగి పెద్దయిన తర్వాత కూడా భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని భావించి తన కూతురిని సంపులో పడేసి హత్య చేసినట్లుగా అంగీకరించింది. దీంతో పోలీసులు ప్రసన్న మీద కేసు నమోదు చేసుకొని ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.