ఐపీఎల్ ..ఇండియన్ ప్రీమియర్ లీగ్ .. ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్ లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్ కి సంబంధించిన మినీ వేలం ఈ నెల 18న చెన్నైలో జరగనున్న ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు 1097 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వెస్టిండీస్ నుంచి అత్యధికంగా 56 ఎంట్రీలు రాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38) ఉన్నాయి. రిజిస్ట్రేషన్ గడువు నిన్నటితో ముగిసింది. 21 మంది కేప్‌డ్ ఇండియన్లు సహా 207 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు వేలం జాబితాలో ఉన్నారు.
ఇక ఫిబ్రవరి 18న జరిగే సీజన్ 14 ఐపిఎల్ వేలం బరిలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తోపాటు నిషేధం ముగిసిన కేరళకు చెందిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ ఉన్నారని నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. 27 మంది ఆటగాళ్లు ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా 863 మంది అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు. వీరిలో 743 మంది భారతీయ క్రికెటర్లు కాగా, 68 మంది విదేశీయులు. కనీసం ఒక ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అన్‌క్యాప్‌డ్ ఇండియన్ ఆటగాళ్లు 50 మంది ఉండగా, అన్‌క్యాప్‌డ్ విదేశీ ఆటగాళ్లలో ఇద్దరు ఉన్నారు.
ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా తమ జట్టులోకి 25 మంది ఆటగాళ్లను తీసుకుంటే వేలంలోకి 61 మందిని తీసుకుంటామని ఐపీఎల్ తెలిపింది. ఇందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏకంగా రూ. 53.20 కోట్లతో వేలానికి దిగనుండగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 35.90 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 34.85 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 22.90 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 15.35 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ వద్ద రూ. 12.9 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద చెరో రూ. 10.75 కోట్లు ఉన్నాయి.