Crime News: మృత్యు ఎప్పుడు ఎవరిని ఎలా కబలిస్తుంది ఎవరికీ తెలియని విషయం. ఇప్పుడు ప్రాణాలతో ఉన్న వారు అనుకోని సంఘటనల వల్ల నిమిషాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తూ సరదాగా ఈత కొట్టాలని అనకున్న బాలుడు తన సరదా తీరకముందే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాలలోకి వెళితే…కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఐరన్‌బండకు చెందిన ముల్లా మాబాషా, ఫాతిమా దంపతులు నివాసముంటున్నారు. దంపతులిద్దరూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
వీరి కుమారుడు సోహెల్ గోనెగండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదివుతున్నాడు. సోహెల్ చిన్నతనంలోనే శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడేవాడు. కూలి పనులు చేసి జీవనం సాగించే వారికి వారి కుమారుడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 5 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ చికిత్స చేయించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం కుదుట పడటంతో పాఠశాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో సోహెల్ పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న ఎల్‌ఎల్‌సీ కాల్వలో సరదాగా ఈత కొట్టడం కోసం కాలువలో దిగాడు. కానీ కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ప్రవాహ ధాటికి తట్టుకోలేక సోహెల్ నీటిలో కొట్టుకుపోయాడు.
సోహెల్ నీటిలో కొట్టుకు పోవడాన్ని గమనించిన తన స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న స్థానికులు సోహెల్ రక్షించడానికి ఎంతగానో ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. సోహెల్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామస్థుల సహాయంతో సోహెల్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ గరాల కొడుకు ఇలా అర్ధాంతరంగా మరణించడంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది.ఈ విషాదకర సంఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.