ఏపీ ప్రభుత్వం మద్య నిషేదంలో భాగంగా మద్యం ధరలను విపరీతంగా పెంచిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాలు అత్యధికంగా 25 శాతం ధరలు పెంచితే వైకాపా ప్రభుత్వం మాత్రం 75 శాతం పెంచింది. ఎంత నిషేదమైనా ఇంతలా ధరలు పెంచుతారా.. ఇది పేదలను దోచుకోవడమే అంటూ చాలా మంది మండిపడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం ధరలు పెంచితే కొనేవాళ్లు తగ్గుతారు కదా అని సమర్థించుకుంది. కానీ మందు తాగేవారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. మందుబాబులు ఎంతైనా పెట్టి మందు కొనుక్కోవడానికి సిద్దపడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం, పేదల జేబులకు చిల్లులు. ఇది ఇకవైపు జరిగే నష్టమైతే పెరిగిన రేట్లు చెల్లించి మద్యం కొనలేని వారు ప్రమాదకర మార్గాలు వెతుకుతూ ప్రాణాలు కొల్పోతున్నారు.
తాజాగా ప్రకాశం జిల్లా కురిచేడులో కొందరు యాచకులు మత్తు కోసం శానిటైజర్ సేవించగా వారిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కురిచేడులోని ఓ ఆలయం వద్ద బిక్షాటన చేస్తూ పొట్టపోసుకునే కొందరు యాచకులు మద్యానికి బానిసయ్యారు. కానీ ధరలు విపరీతంగా పెరగడంతో అంత వెచ్చించలేక, మద్యం తాగకుండా ఉండలేకపోయారు. చివరికి శానిటైజర్లలో ఆల్కాహాల్ ఉంటుందని విని కొన్ని రోజులుగా వాటినే సేవిస్తున్నారు. దీంతో కడుపులో మంట పెరిగి ముగ్గురు రాత్రికి రాత్రే మరణించారు.
ఇంకో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరంతా లాక్ డౌన్ ప్రభావంతో ఆదాయం లేక మద్యం కొనలేక మత్తు కోసం శానిటైజర్ తాగుతున్నారని, కొందరు వారించినా వినకుండా నాటు సారాలో శానిటైజర్ కలుపుకుని సేవిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ వరుస మృతులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరంతా శానిటైజర్ తాగే మరణించారా లేకపోతే కల్తీ మద్యం, కల్తీ సారా తాగి మరణించారా అనేది దర్యాప్తు చేస్తున్నారు.