AP & TS Are In Dilemma : ఎనిమిదేళ్ళయినా పూర్తవని ‘పంపకం’.. సిగ్గుపడాల్సిందెవరు.?

AP & TS Are In Dilemma : 3 ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన జరిగి ఏడున్నరేళ్ళు దాటింది.. ఎనిమిదేళ్ళు పూర్తయిపోనుంది. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలకు పరిష్కారం లభించలేదు. సమీప భవిష్యత్తులో లభిస్తుందన్న ఆశలూ లేవు. నీళ్ళ పంపకాల విషయంలోనే కాదు, ఉమ్మడి ఆస్తుల విభజనలోనూ వివాదాలున్నాయి.

ఏ కేంద్ర ప్రభుత్వమైతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించిందో, ఆ కేంద్ర ప్రభుత్వమే విభజన సమస్యల్ని పరిష్కరించి తీరాలి. అప్పట్లో మన్మోహన్ ప్రభుత్వం.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం.. అని అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అధికారంలో ఎవరున్నా, అక్కడ పని చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం.. రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ సమస్యల విషయమై నిర్లక్ష్యం వహించాయి. తెలంగాణలో కేసీయార్ సర్కారు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇక్కడ ఒకరు ఎక్కువా కాదు, ఇంకొకరు తక్కువా కాదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒక్క చోట కూర్చుని చర్చించుకుని పరిష్కరించగల అంశాలు చాలానే వున్నాయి. వాటికే పరిష్కారం దొరకలేదు ఇప్పటిదాకా.

ఏడున్నరేళ్ళ తర్వాత కేంద్ర ప్రభుత్వం, కొత్తగా ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమన్నా వుందా.? ‘మీ చావు మీరు చావండి..’ అన్నట్టుగా తయారైంది కేంద్రం తీరు.

కేవలం తెలుగు రాష్ట్రాల విషయంలోనే కేంద్రం ఇంత నిర్లక్ష్యం వహిస్తోందా.? అంటే, గతంలో విభజన జరిగిన రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇంకా సమస్యలున్నాయి. మొత్తంగా ఇది వ్యవస్థ వైఫల్యం.. ఔను, రాజకీయ వ్యవస్థ వైఫల్యమిది. మిగతా రాష్ట్రాల సంగతి వేరు.. ఉమ్మడి తెలుగు రాష్ట్రం పరిస్థితి వేరు.

తాము వద్దనుకున్న విభజనను బలవంతంగా కేంద్రం తమ మీద రుద్దిందని 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ వాపోతోంది. ఇప్పటికీ తమ రాజధాని ఏదో తెలియని అయోమయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఈ గందరగోళానికి పూర్తి బాధ్యత కేంద్రమే వహించాలి.