ఏడాది కాదు.. రెండేళ్ళు కాదు.. ఐదేళ్ళు కాదు.. ఏకంగా ఏడేళ్ళు దాటింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి. ఇదిగో బంగారు తెలంగాణ.. అదిగో బంగారు తెలంగాణ.. అంటూ కాలం వెల్లదీసేస్తోంది తెలంగాణలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా, తెలంగాణ వెనుకబాటుతనానికి కారణం సీమాంధ్ర.. అంటూ రచ్చ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, బంగారు తెలంగాణ విషయమై పబ్లిసిటీ స్టంట్లు తప్ప, వాస్తవిక ప్రపంచంలో అభివృద్ధి దిశగా దూకుడు ప్రదర్శించలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. అయితే, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టే, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగామన్నది తెలంగాణ రాష్ట్ర సమితి వాదన. ఇదిలా వుంటే, తెలంగాణ రాష్ట్రమైతే సాధించుకున్నాంగానీ.. తెలంగాణ ఉద్యమకారుల్ని గౌరవించుకోలేకపోతున్నామన్న వాదన తెలంగాణ రాష్ట్ర సమితిలోని ఉద్యమ నేతల్లో వుంది.
ఒకరొకరుగా తెలంగాణ ఉద్యమ నేతలు తెలంగాణ రాష్ట్ర సమితికి దూరమవుతున్నారు. ఈ లిస్టులో తాజా వికెట్ ఈటెల రాజేందర్.. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకంగా పనిచేసిన నేతలంతా, ఇప్పుడు వివిధ పార్టీల్లో వున్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి విమర్శలు ఎదుర్కొన్న నేతలు, ‘తెలంగాణ ద్రోహులు’గా ముద్ర పడ్డవారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇక, ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో ఏనాడూ కనిపించని తీవ్రమైన వరదలు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో.. హైద్రాబాద్, వరంగల్ వంటి నగరాలు చవిచూడాల్సి వచ్చింది.
ఇవన్నీ ఓ యెత్తు.. సందర్భానుసారం బీజేపీ మీద విమర్శలు చేస్తూ, సందర్భానుసారం బీజేపీకి సహకరిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి చిత్రమైన రాజకీయాలు చేస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఇంతకీ బంగారు తెలంగాణ అంటే ఏంటి.? అదెలా వుంటుంది.? ఈ ప్రశ్నకు మాత్రం ఇప్పట్లో సమాధానం దొరికేలా లేదు. బంగారు తెలంగాణ.. అంటే, అదో టైపు సెంటిమెంట్. తెలంగాణ ఉద్యమంలానే ఇది కూడా.. అనుకోవాలేమో. తెలంగాణ ఉద్యమం విజయ తీరాలకు చేరింది.. కానీ, బంగారు తెలంగాణ నినాదం.. కేవలం ప్రచారానికే పరిమితమవుతోంది.