U Turns of YS Jagan : సీఎం వైఎస్ జగన్ ‘ఐదు’ బిగ్ ‘యూ టర్న్స్’ ఇవే.!

U Turns of YS Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడచిన మూడేళ్ళ కాలంలో చాలా యూ టర్నులు తీసుకున్నారు. అందులో అతి ముఖ్యమైనవి ఇవేనంటూ కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్దయెత్తున ఓ ప్రచారం జరుగుతోంది.

వీటిల్లో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమేనన్నది మెజార్టీ అభిప్రాయం. ‘మేం అధికారంలోకి వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తాం..’ అని చెప్పిన వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చాక, మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమరావతి అభివృద్ధిని అటకెక్కించేశారు. అయితే, ప్రతిష్టాత్మకంగా మూడు రాజధానుల చట్టం తెచ్చి, దాన్ని వెనక్కి తీసుకున్నారు.

ఇక, మద్యం విధానం విషయానికొస్తే, లిక్కర్ ధరలు పెంచారు.. ఆ తర్వాత తగ్గించేశారు. ధరలు పెంచడం ద్వారా మద్యపానాన్ని నియంత్రించగలుతామని చెప్పి, ధరలు తగ్గించడానికి సహేతుకమైన కారణాలు చెప్పలేకపోయారు. ఇదొక ఫెయిల్యూర్ విధానంగానే చెప్పుకోవాలి.

శాసన రాజధాని విషయానికొస్తే, ఇది మరీ అత్యంత దారుణమైన యూ టర్న్. తమ చేతిలో శాసన మండలి రద్దు వ్యవహారం వుండదని తెలిసీ, నాటకీయ పరిణామాల మధ్య శాసన మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించేశారు. ఆ తర్వాత ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు.

మరో ముఖ్యమైన అంశం సినిమా టిక్కెట్ల వ్యవహారం. సామాన్యుడికి సినిమాని దూరం చెయ్యకూడదన్న ఉద్దేశ్యంతో టిక్కెట్ ధరల్ని తగ్గించామన్నారు.. ఇప్పుడేమో పరిశ్రమ బాగు కోసమంటూ పెంచేశారు. మరి, పేద ప్రేక్షకులు రాత్రికి రాత్రి ధనవంతులైపోయారని వైసీపీ భావిస్తోందని అనుకోవాలా.?

చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. పార్టీ మారే ప్రజా ప్రతినిథులు వెంటనే అనర్హత వేటుకు గురవుతారని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ, వల్లభనేని వంశీ సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇంకా అనర్హత వేటుకు గురికాలేదు. ఇది మరో యూ టర్న్‌గా భావించాలేమో.!