వైఎస్ షర్మిల పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మేర పూర్తి.! తెలంగాణ రాజకీయాలపై ప్రభావమెంత.?

నడిచీ నడిచీ కాళ్ళు నొప్పులు పుట్టడమేనా, తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిలకి రాజకీయంగా ఏమైనా ఉపయోగముందా.? ఈ చర్చ, రెండు వేల కిలోమీటర్ల మేర ఆమె ‘ప్రజా ప్రస్తానం’ పాదయాత్ర పూర్తి చేసుకుంటున్న తరుణంలోనూ వినిపిస్తోంది. నిజానికి, తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల పేరు ఎక్కడా వినిపించడంలేదు.. ఇంతకాలం తర్వాత కూడా.

అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదించి వైఎస్ షర్మిల తెలంగాణలో సొంత కుంపటి (రాజకీయ పార్టీ) పెట్టారన్నది ప్రముఖంగా వినిపించే ఓ వాదన. అదే నిజమైతే, ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టేవారు. తెలంగాణలో అధికార పీఠమెక్కాలన్న లక్ష్యంతోనే వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టారు. దానికి అన్న వైఎస్ జగన్ ఆశీస్సులు కూడా వుండే వుండాలి.

ప్రస్తుతానికి తెలంగాణలో వైఎస్ షర్మిల ఇంత సుదీర్ఘంగా పాదయాత్ర చేయగలుగుతున్నారంటే, అన్న వైఎస్ జగన్ ఆశీస్సులతోనే.. ఒకప్పటి వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఇప్పుడు వైటీపీకి మద్దతుదారులుగా మారడం వల్లనే షర్మిల పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగగలుగుతోంది. ఆ పాత వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకే ప్రస్తుతానికి షర్మిలకు తెలంగాణలో ఆధారం.

తెలంగాణలో మీడియా వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రని కవర్ చేయకపోయినాగానీ, ఆమె మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. ఈ విషయంలో షర్మిలను అభినందించి తీరాల్సిందే. అయితే, ఎన్నాళ్ళిలా.? తెలంగాణలో బీజేపీ రాజకీయంగా ఎదుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి తన వెలుగుల్ని కోల్పోలేదు. కాంగ్రెస్ మాత్రం నిర్వీర్యమైపోయింది.

కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఏపీలో వైసీపీ వైపు తిరిగినట్లే, తెలంగాణలో వైటీపీ వైపు తిరిగితే, షర్మిలకు అది రాజకీయంగా ప్లస్ అవుతుంది. కానీ, దాని వల్ల ప్రయోజనమెంత.? తెలంగాణ రాజకీయాల్లో తనదైన ప్రభావాన్ని షర్మిల ఇంకా చూపించలేకపోతున్నారు. వస్తున్న ఏ ఉప ఎన్నికలోనూ పోటీ చేసేందుకు సైతం వైఎస్ షర్మిల ధైర్యం చేయలేకపోతున్నారు.

2 వేల కిలోమీటర్లు.. ఓ మైలు రాయి.! ఆ తర్వాత ఏంటి.? మూడు వేల కిలోమీటర్లు. అంతేనా.? రాజకీయంగా బలపడేది ఏమైనా వుందా.?