21 ఏళ్ళ నుండి టీడీపీలో ఉన్న సీనియర్ లీడర్ రేపు వైసీపీలోకి 

ఏపీలో వైసీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మెల్లగా సాగిపోతోంది.  టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలనే కాదు కీలకమైన నేతల్ని కూడా తమలోకి లాక్కుంటోంది వైసీపీ.  ఇప్పటికే మద్దాలి గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ లాంటి బలమైన నేతలను బయటకు లాగిన వైసీపీ ఇప్పుడు మరొక నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మీద దృష్టి పెట్టింది.  ప్రకాశం జిల్లాలో శిద్దా రాఘవరావు టీడీపీకి బలమైన నేత.  గత ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానం నుండి పోటీచేసి ఓడినా కూడా ఆయన బలం తగ్గలేదు.  
 
ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో ఆయకున్న క్యాడర్ బలం అలాగే ఉంది.  ఇప్పటికే ప్రకాశం జిల్లా వైకాపా వశం కాగా ఇప్పుడు మిగిలిన ఒకే ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ శిద్దా రాఘవరావు కూడా పార్టీని వీడనుండటంతో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది.  శిద్దా రేపే వైసీపీ కండువా కప్పుకోనున్నారు.  ఆయనతో పాటే మండల స్థాయి నేతలు కూడా కొందరు టీడీపీని వీడే అవకాశం ఉంది.  ఇదివరకే ఆయన పార్టీ మారాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా మారుతున్నారు. 
 
ఈ పిరాయింపు వెనుక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పాత్ర ప్రముఖంగా ఉంది.  ఇకపోతే 1999లో తెలుగు దేశం కండువా కప్పుకున్న శిద్ధా రాఘవరావు పార్టీలో పలు కీలక బాద్యతలు నిర్వహించారు.  2006లో శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా చేసి 2007లో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు.  2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నుంచి గెలిచి బాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. సుమారు 21 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న ఆయన ఇప్పుడు పార్టీ మారడం నిజంగా ఆ పార్టీకి లోటనే చెప్పాలి.