అప్పటోల ‘టాటా’ నుంచి 2.8 కోట్లకు ఎయిర్ ఇండియాని కొనుగోలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అదే ‘టాటా’ 18 వేల కోట్లు చెల్లించి ఎయిర్ ఇండియాని సొంతం చేసుకుంటోంది.. అదీ కేంద్ర ప్రభుత్వం నుంచి. అంటే, ఎయిర్ ఇండియా ప్రయాణం టాటా నుంచి బయల్దేరి, తిరిగి టాటా వద్దకు చేరుకుందన్నమాట.
ఈ మధ్యకాలంలో చాలా చాలా జరిగింది. ఎయిర్ ఇండియా చాలా ఎదిగింది. ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించడమే కాదు, పాతాళానికి పడిపోయే పరిస్థితుల్నీ ఎదుర్కొంది. చివరికి కేంద్ర ప్రభుత్వం, ఎయిర్ ఇండియాని వదిలించుకోవడానికే నిర్ణయం తీసుకుంది.
ఇదొక బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే, ఎయిర్ ఇండియా అనగానే.. అదొక బ్రాండ్.. అది ఇండియన్ బ్రాండ్.. భారతీయుల ఆత్మగౌరవం.. అనే అభిమానం అందరికీ వుండేది. ఇకపైనా, అది ఇండియాకి చెందిన సంస్థే. కాకపోతే, ప్రైవేటు సంస్థ మాత్రమే అవుతుంది. అదీ అసలు సమస్య.
పోన్లే, టాటా చేతికి చిక్కింది గనుక, తిరిగి ఎయిర్ ఇండియా పుంజుకుంటుందనే చిన్నపాటి ఆశాభావం ఎయిర్ ఇండియా అభిమానుల్లో వ్యక్తమవుతోంది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాని ఎందుకు ఆదుకోలేకపోయింది.? ఎందుకు ఎయిర్ ఇండియాని అమ్మేసి సొమ్ము చేసుకోవాలనుకుంది.?
సమాధానం సింపుల్.. అమ్మేయడమే అభివృద్ధి అనే మాటకు కట్టుబడి వుండిపోయింది కేంద్రంలోని మోడీ సర్కార్. స్టీలు ప్లాంటు, ఎయిర్ లైన్స్.. ఏదైనాసరే.. అమ్మేయడమే ఉత్తమం అన్న భావనలో కేంద్రం వున్నప్పుడు ఇలాంటివి జరగడం మామూలే. అమ్మేయడం తేలిక, కానీ.. అలా వచ్చిన సొమ్ములతో చేస్తున్న అభివృద్ధి ఏంటి.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఎలా.?