Ganga: మహాభారతంలో కర్ణుడిని కుంతీదేవి ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసిన సంఘటన గురించి మనం చదువుకున్నాం. సీరియల్స్, సినిమాల్లో చూశాం. పురాణ సంఘటనే పునరావృతమైనట్టు ఇప్పుడు అదే తరహాలో ఓ చంటిబిడ్డకు జరిగింది. ఓ చెక్కపెట్టెలో 21 రోజుల చిన్నారిని పెట్టి నదిలో వదిలేశారు. నదిలో బోటు నడిపే వ్యక్తికి ఆ పెట్టె దొరకడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ చంటిబిడ్డను పోలీసులు అనాధ శరణాలయానికి చేర్చారు. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో జరిగింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఘాజీపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని గంగానది దాద్రి ఘాట్ వద్ద ఓ బోటు నడిపే వ్యక్తికి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. చుట్టూ చూస్తే కనిపించలేదు.. నదిలో వెళ్తున్న పెట్టెలో నుంచి మాత్రం ఆ ఏడుపును పసిగట్టాడు. వెంటనే ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చి తెరిచి చూశాడు. అతని కళ్లను తానే నమ్మలేనట్టుగా అందులో ఓ చంటిబిడ్డ ఉంది. పెట్టెలో కనకదుర్గమ్మ ఫొటో పెట్టి ఉంది. పాప జాతకం ఉంది. దాని మీద పాపకు జాతక ప్రకారం ‘గంగ’ అని పేరు పెట్టినట్టు.. అదే పేరుతో పిలవాలని రాసుంది. దీంతో బోటు నడిపే వ్యక్తి ఆనందంలో తేలిపోయాడు. గంగమ్మే తనకు బిడ్డను ప్రసాదించిందని.. తానే ఆ బిడ్డను పెంచుకుంటానని గ్రామానికి తీసుకొచ్చాడు.
అయితే.. విషయం ఆనోటా.. ఈనోటా పోలీసులకు చేరింది. వారు అతడి ఇంటికి చేరుకుని బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. బిడ్డను పెంచుకునేందుకు వీల్లేదని చంటిబిడ్డను ఆశాజ్యోతి కేంద్ర అనాధ శరణాలయంలో చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బిడ్డ ఉన్న చెక్కపెట్టె కొత్తది. బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఎవరో కావాలనే ఈ పని చేశారని పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. ప్రస్తుతం ఈ చంటిబిడ్డ విషయం స్థానికంగా సంచలనం రేపుతోంది. ఘటనా స్థలానికి చిన్నారిని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు.