తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్రతీ ఏడాది కార్యకర్తలు, నేతలు సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మహానాడు కార్యక్రమానికి దాదాపు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. అయితే ఈసారి ఆఛాన్స్ లేకపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ లో నాల్గవ దశ లాక్ డౌన్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కొన్నింటికి మినహాయింపులు ఇచ్చినప్పటికీ జనాలు గుమ్మిగూడటానికి ఛాన్స్ లేదు కాబట్టి మహానాడు ఈసారి చప్పగా సాగక తప్పదు. దీనిలో భాగంగా ఈనెల 27, 28 తేదీల్లో మహానాడుని ఆన్ లైన్ లో నిర్వహించేందుకు అదిష్టానం నిర్ణయించింది.
ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమాల షెడ్యూల్, తీర్మానాల్ని ఖరారు అయ్యాయి. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నొక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు నిన్న పార్టీ కార్యాలయంలో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. మొత్తం 13 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. వైకాపా ఏడాది పాలనలో వైఫల్యాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజధాని అమరావతి విషయం, క్షీణించిన శాంతి భద్రతలతో పాటు పలు అంశాలపై తీర్మానాలు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈనెల 27 పదిగంటలకి పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమం మొదలవుతుంది.
ఆ తర్వాత పలువురు సీనియన్ నేతలు మాట్లాడుతారు. అటుపై అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు ప్రసగించనున్నారు. తొలి రోజు ఆరు తీర్మానాలు, రెండవ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి మిగిలిన ఏడు తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఇటీవలే వైకాపా ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు ఎదుర్కోవడంతో! మహానాడులో ప్రభుత్వ పాలనపై పెద్ద ఎత్తున విమర్శలు చేయడం మహానాడు ప్రధాన ఎజెండగా మారనుందని నిపుణుల అభిప్రాయం. ఆన్ లైన్ లోనే వీక్షించాల్సి ఉంటుంది.