ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అయితే.. ప్రభుత్వం అయిష్టంగానే ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలు.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎస్ ఈసీ నిమ్మగడ్డకు ఫిర్యాదు ఇచ్చినా.. మా ఇంట్లో గేదెలకు ఇచ్చినా ఒక్కటే అని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్య తీవ్ర కలకలం సృష్టించింది.
నిమ్మగడ్డ… చంద్రబాబు మనిషని…ఆయన పేరు నిమ్మగడ్డ చంద్రబాబని.. ఇద్దరి డీఎన్ ఏ కూడా ఒక్కటేనని.. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నిమ్మగడ్డరమేష్ కుమార్… ప్రభుత్వ పెద్దలు సంయమనం పాటించాలని.. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు.. ఈ మంత్రులు సహా సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై గవర్నర్ కు లేఖ రాశారు. వీరిని అదుపు చేయాలని లేకపోతే…కోర్టుకువెళ్తానని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య వివాదం మరింత ముదిరింది.
ఇక ఇంతలోనే.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలు.. ఏకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడం గమనార్హం. నిమ్మగడ్డ తమను అవమానించారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇచ్చిన నోటీసులో మంత్రులు ఇద్దరూ ఫిర్యాదు చేశారు. అయితే.. రాజ్యంగా బద్ధమైన పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్పై హక్కుల నోటీసు ఏమేరకు పనిచేస్తుంది? అసలు ఇది సాధ్యమేనా.. ? అనే విషయం తేలాల్సి ఉంది. కానీ. ఇప్పటికిప్పుడు మాత్రం నిమ్మగడ్డపై ప్రభుత్వం చేస్తున్న కౌంటర్ అటాక్ గానే చూస్తున్నారు పరిశీలకులు.