ఇంటర్, పదో తరగతి పరీక్షల రద్దు.. క్రెడిట్ నారా లోకేష్ ఖాతాలోకి..

10th Inter Exams Cancelled,

10th Inter Exams Cancelled,

ఎట్టకేలకు ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మంత్రి ఆదిమూలపు సురేష్ నిన్న రాత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. నిజానికి, దాదాపు రెండు నెలల క్రితమే ఈ నిర్ణయం ఆంధ్రపదేశ్ ప్రభుత్వం తీసుకుని వుండాల్సింది. అలా నిర్ణయం తీసుకుని వుంటే, ఈ రెండు నెలలు.. తమ తదుపరి చదువుల మీద విద్యార్థులు ఫోకస్ పెట్టి వుండేవారే. ఓ వైపు కరోనా, ఇంకో వైపు పరీక్షలు.. వెరసి, రాష్ట్రంలో విద్యార్థులు ఈ రెండు నెలల్లో పడ్డ మానసిక వేదన అంతా ఇంతా కాదు.

పరీక్షలు ఎలాగైనా నిర్వహించాలని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయింది. కానీ, సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించేసరికి వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే, మొదటి నుంచీ విద్యార్థుల పరీక్షల విషయమై తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలబడింది.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అందునా, నారా లోకేష్ అయితే.. సోషల్ మీడియా వేదికగా.. జూమ్ మీటింగుల ద్వారా విద్యార్థులతో మమేకమవుతూ వచ్చారు. వారికి భరోసా ఇస్తూ వచ్చారు.

ప్రభుత్వం మెడలు వంచి పరీక్షలు రద్దు చేయిస్తామన్నారు. ఎలాగైతేనేం, పరీక్షలు రద్దయ్యాయి. దాంతో, క్రెడిట్ మొత్తం నారా లోకేష్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లతోనే ఆంధ్రపదేశ్ ప్రభుత్వం దిగొచ్చినా… నారా లోకేష్ తమకు అండగా నిలవడం వల్లే ప్రభుత్వం దిగొచ్చిందన్న భావన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ప్రస్తుతానికి కనిపిస్తోంది. అందుకు నిదర్శనం సోషల్ మీడియాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి నారా లోకేష్ మీద కురుస్తున్న ‘థ్యాంక్స్’ వర్షమే.

పరీక్షల రద్దు విషయమై ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేదని మొదటి నుంచీ రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతూ వస్తున్నారు. అధికార పార్టీలోనూ కొందరు ఈ విషయమై ముఖ్యమంత్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. కానీ, కొందరు మాత్రం ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారని అంటున్నారు. క్రెడిట్ అనవసరంగా నారా లోకేష్ ఖాతాలోకి వెళ్ళిపోయిందని ఇప్పుడు తీరిగ్గా అధికార పార్టీ తలపట్టుక్కూర్చుంటే ఏం లాభం.?