మునుగోడు ఖర్చు 10 వేల కోట్లు.! నిజమేనా.? నమ్మొచ్చా.?

డబ్బులు చెట్లకు కాస్తున్నాయా.? అని ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుంటుంది. ఇవి మామూలు చెట్లు కావు, పొలిటికల్ చెట్లు.! ఇవి రాజకీయ నాయకుల పెరట్లో మాత్రమే వుండే చెట్లు. వీటికి మాత్రమే డబ్బులు కాస్తుంటాయ్.!

18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారన్నది కాంగ్రెస్, టీఆర్ఎస్ విడివిడిగా చేస్తున్న ఆరోపణ. ‘ఆయన కాంట్రాక్టరు.. కాంట్రాక్టులు సహజమైన పద్ధతిలో ఆయనకు దక్కితే తప్పేంటి.?’ అన్నది బీజేపీ వాదన.

‘అబ్బే, కాంట్రాక్టులు చేయడం ఎప్పుడో మానేశా.. నేనిప్పుడు ప్రజా జీవితంలో వున్నాను..’ అంటూ కొన్నాళ్ళ క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏది నిజం.

రాజకీయ నాయకులు కాంట్రాక్టులు పొందడం అనేది సర్వసాధారణం. అసలు రాజకీయాలు చేసేదే డబ్బు సంపాదించడం కోసం.. సంపాదించిన డబ్బుని కాపాడుకుంటూనే, మరింతగా డబ్బు సంపాదించడమే రాజకీయ నాయకుల లక్ష్యం.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదు, రాజకీయాల్లో వున్నవారందరికీ ఏదో ఒక రూపంలో వ్యాపారాలుంటాయ్. ఇసుక వ్యాపారాలు, మద్యం వ్యాపారాలు, కాంట్రాక్టులు.. వాట్ నాట్.. రాజకీయ నాయకులు లేని విభాగమంటూ లేదు వ్యాపార రంగంలో.

అయినాగానీ, మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం 10 వేల కోట్లు ఖర్చు చేయడానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయంటే నమ్మగలమా.? అదీ ఏడాది కాల పరిమితి మాత్రమే వున్న ఎమ్మెల్యే పదవి కోసం అంత ఖర్చు ఎందుకు జరుగుతుంది.? ఒక్క నియోజకవర్గానికే పది వేల కోట్లు అంటే.. పది నియోజకవర్గాలకి లక్ష కోట్లు.. 100 నియోజకవర్గాలకి పది లక్షల కోట్లు.. నాన్సెన్స్.. రాష్ట్ర బడ్జెట్‌ని మించిపోలా.?