స్వీయ నిర్భధంలోకి కేజ్రీవాల్.. రేపు కరోనా టెస్ట్ 

రెండున్నర నెలల లాక్ డౌన్ అనంతరం కూడా ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడలేదు.  భారీగా లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.  మొత్తం మీద దేశంలో ఇప్పటి వరకు 2.57 లక్షలు దాటగా వైద్యులు, ప్రజాప్రతినిధులు కూడా మహమ్మారి భారిన పడటం ప్రజల్లో మరింత ఆందోళనను కలిగిస్తోంది.  తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం అస్వస్థతకు గురయ్యారనే వార్తలు కలకలం రేపుతోంది.  
 
సీఎం కేజ్రీవాల్ గత రెండు రోజులుగా గొంతునొప్పి, జలుబు లక్షణాలతో బాధపడుతున్నారని, ఈరోజు అస్వస్థతకు గురయ్యారని, దాని మూలంగా అధికారిక సమావేశాలన్నీ రద్దు చేసుకున్నట్టు జాతీయా మీడియా సంస్థలు వెల్లడించాయి.  అంతేకాదు ప్రస్తుతం ఆయన స్వీయ నిర్భంధంలో ఉన్నారని, రేపు మంగళవారం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.  అయితే ఈ విషయమై ఢిల్లీ సీఎంవొ నుండి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. 
 
దేశంలో కోవిడ్ 19 వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఉంది.  మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత 27,564 కేసులతో ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది.  అందుకే కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.  ఇక ఈరోజు నుండి దేశంలో ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు కూడా తెరుచుకోనుండటంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత లాంటి జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.