సీఎం జగన్ దేనికీ భయపడరు.. జేసీ ఆవేదన

ఈరోజు ఉదయం జరిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  జేసీ ట్రావెల్స్ కు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగంతో వారిని అరెస్ట్ చేశారు.  154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్వోసీలు సృష్టించారని, వాహనాలను బీఎస్ 3 నుండి బీఎస్ 4కు మార్చడం, ఇన్స్యూరెన్సులు చెల్లించకుండానే చెల్లించినట్టు నకిలీ పత్రాలు సృష్టించడం వంటి అభియోగాలు వీరి మీదున్నాయి. 
 
ఈ అరెస్టు విషయాన్ని టీవీలో చూసి తెలుసుకున్న ప్రభాకర్ రెడ్డి సోదరుడు దివాకర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రికి ఎవరు ఎదురు మాట్లాడినా పరిస్థితి ఇలానే ఉంటుందని, రేపు తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని దివాకర్ రెడ్డి అన్నారు.  ప్రభాకర్ రెడ్డికి ఇటీవలే బైపాస్ సర్జరీ అయిందని, జగన్ తమ ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో ఉన్నారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.  అసలు జగన్ దేనికీ, ఎవరికీ భయపడరని, ఎవరైనా అయన దారిలోకి వెళ్లకపోతే ఇలాంటివే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నిజానికి జేసీ సోదరులకు చెందిన జేసీ ట్రావెల్స్ మీద ఇంతకుముందు నుండే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  గతంలో జేసీకి చెందిన 100కు పైగా బస్సులను సరైన అనుమతులు లేవని సీజ్ చేసిన ఆర్టీవో అధికారులు ఈమధ్య ఇంకో 50 వాహనాలను ఎన్వోసీలు లేవని సీజ్ చేశారు.  ఆ తర్వాత చర్యగా ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడ్ని అరెస్ట్ చేశారు.  ఇక తెలుగు దేశం నేతలైతే ఇవన్నీ కక్షపూరిత చర్యలని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.