సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టవచ్చని హైకోర్టు నుండి ఉత్తర్వులు రాగానే కేసీఆర్ హడావుడిగా కూలగొట్టే పనులు స్టార్ట్ చేశారు. రహదారులు మూసేసి, పోలీస్ బందోబస్తు మధ్యన కూల్చే ప్రక్రియ జరుగుతోంది. ప్రభుత్వం కూలుస్తున్నది శిధిలావస్థలో ఉన్న భవనాన్ని కాదు.. ఇంకో 50 ఏళ్లు భేషుగ్గా నిలబడగల పటిష్టమైన భవనాన్ని. 130 ఏళ్ల పైబడిన చరిత్ర కలిగిన భవనాన్ని. మొదటి నుండి భవనాన్ని కూల్చవద్దని ఎంతమంది ల చెప్పినా వినని కేసీఆర్ చివరకు అనుకున్నట్టే కోర్టు అనుమతులు తెచ్చుకున్నారు. అంటే వివాదంలో ఆయనే గెలిచినట్టు.
సో.. సచివాలయాన్ని కూల్చి తన హాయాంలోనే కొత్తది కట్టాలనే ఆయన పంతం అక్కడే గెలిచేసింది. ఇక పాతదాన్ని కూల్చడం, కొత్తది కట్టడం అనేది తప్పక జరిగే పనులే. వాటిని ఎవరూ ఆపలేరు. కానీ అంత మంచి భవనాన్ని కూలుస్తున్న ప్రభుత్వం ఒక్కసారి ప్రస్తుత పరిస్థితిని ఒక్కసారి గుర్తుచేసుకుని ఉంటే బాగుండేది. హైదరాబాద్ కరోనాతో అల్లాడిపోతోంది. రోజుకు కనీసం వేయికి పైగా కేసులు వస్తున్నాయి. వైద్య సదుపాయాలు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు వ్యాధిగ్రస్తులు. గాంధీ, నిమ్స్, ఉస్మానియాల్లో బెడ్లు అందుబాటులో లెవనేది వాస్తవం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఆవసరం.
ఇలాంటి పరిస్థితుల్లో 10 లక్షల చదరపు అడుగుల్లో, 10 బ్లాకులతో బ్రహ్మాండమైన, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన పాత సెక్రటేరియట్ భవనాన్ని కొన్ని మార్పులు చేస్తే కొవిడ్ ఆసుపత్రిగా వాడుకోవచ్చు. పైగా భవనం సిటీకి నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉంటుంది. గట్టిగా ఒక వారం దృష్టి పెట్టి పని చేస్తే సచివాలయాన్ని ఆసుపత్రిగా మార్చడం ప్రభుత్వానికి కష్టమేమీ కాదు. ఈ కరోనా గత్తర తగ్గేవరకు భవనాన్ని ఆసుపత్రిగా వాడుకోవచ్చు. అన్నీ కుదురుకున్నాక కూల్చుకుని కొత్త భవంతి కట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ ఆ పని చేయలేదు. భవంతి ఉండటమే పాపం అన్నట్టు కూలగొట్టే ప్రక్రియను మొదలుపెట్టారు.