షాకింగ్ డెసిషన్ తీసుకున్న రఘురామరాజు.. రసవత్తరంగా మారిన ఎపిసోడ్ 

ఒకే ఒక్క ఎంపీ.. 151 మంది ఎమ్మెల్యేలతో దుర్భేద్యంగా ఉన్న అధికార వైకాపాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.  పార్టీలోనే ఉంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అధిష్టానాన్ని ఆగమాగం పట్టిస్తున్నారు.  ఆయనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు.  పార్టీ విధానాలపై ఆయన వ్యతిరేక గళం వినిపిండంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది.  షోకాజ్ నోటీసులు పంపి రఘురామరాజును కట్టిడి చేయాలనుకున్నారు.  కానీ రఘురామరాజు రాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీనని, కానీ తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నోటీసులు అందాయని కొత్త లాజిక్ పట్టి నోటీసులు పంపిన విజయసాయిరెడ్డికి షాకిచ్చారు.  
 
 
 
అలాగే నోటీసులకు వివరణ ఇస్తూ తనదేమీ తప్పు లేదంటూ పార్టీలోని లోపాలను మరింత గట్టిగా ఎలివేట్ చేశారు.  దీంతో ఆయన మీద అనర్హత వేటు వేయాలని కొందరు పార్టీ నేతలు భావించారు.  అది పసిగట్టిన రాజుగారు ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్, అమిత్ షా, రక్షణ మంత్రి లాంటి పెద్దలను కలిసి వ్యవహారం చక్కబెట్టుకుని వచ్చారు.  ఇది వైకాపాకు మరింత కోపం తెప్పించింది.  దీంతో అధిష్టానం మరింత సీరియస్ అయి రాజుగారి మీద అనర్హత వేటు వేయించడానికి కొందరు ఎమ్మెల్యేలను, లాయర్లను ఢిల్లీకి పంపింది.  ఈరోజు వారంతా ఓంబిర్లాను కలిసి అనర్హత వేటు కోసం రిక్వెస్ట్ చేయనున్నారు. 
 
 
దీంతో రెబల్ ఎంపీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.  తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.  తనకు వేరే పార్టీ లెటర్ హెడ్‌ మీద షోకాజ్ నోటీసులు ఇచ్చారని పిటిషన్‌‌లో తెలిపారు.  తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఏనాడూ పాల్పడలేదని అయినా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎంపీలు అదే కారణం చూపిస్తూ తనపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని, తనపై అనర్హత వేటు వేసే వీలు లేకుండా స్టే ఇవ్వాలని కోరారు.  ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.  మరి కోర్టు రాజుగారు కోరినట్టు స్టే ఇస్తే మాత్రం అధిష్టానానికి ఎదురుదెబ్బే అవుతుంది.