వైసీపీ ‘రంగు’లాటలో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా 

ప్రభుత్వ కార్యాలయాలకు తమ పార్టీ రంగులు ఉండాల్సిందేనన్న వైసీపీ సర్కార్ మొండి వైఖరికి సుప్రీం కోర్టు మరోసారి అక్షింతలు వేసింది.  రంగులు తొలగించాలని హైకోర్టు రెండవసారి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లగా సుప్రీం సైతం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పార్టీ రంగులు తొలగించాల్సిందేనని తీర్పు వెలువరించింది.  ఇందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.  ఈలోపు తొలగించకపోతే కోర్టు దిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.  దీంతో ఏపీ ప్రభుత్వానికి రంగులు తొలగించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. 
 
ఇలా హైకోర్టులో రెండుసార్లు, సుప్రీం కోర్టులో రెండుసార్లు ప్రభుత్వం భగ్గపడటం ఒక ఎత్తైతే రంగులు వేయడానికి, ఇప్పుడు తొలగించడానికి అయ్యే ఖర్చు నష్టం ఇంకో ఎత్తు.  సర్కార్ చాలా జిల్లాల్లో ఉన్న పంచాయతీ కార్యాలయాలకు మూడు రంగులు వేసేసింది.  ఇందు కోసం ఒక్కో జిల్లాకు సుమారు 5 కోట్లకు పైగానే వెచ్చించినట్టు సమాచారం.  ఒక్క విజయవాడ జిల్లాలోనే 630 గ్రామ సచివాలయాలకు రంగులు వేయడానికి 5 కోట్లు ఖరైందట.  ఈ ప్రకారం రాష్ట్రం మొత్తం మీద అయిన రంగుల ఖర్చు వందల కోట్లలోనే ఉంటుంది.  పైగా వాడినవన్నీ ఖరీదైన ఎమల్షన్ రంగులే కావడం విశేషం. 
 
పోతే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు ఈ రంగులన్నీ తొలగించి తీరాల్సిందే.  ఈ తొలగింపు కూడా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.  వైసీపీ వేసిన మూడు ఎమల్షన్ రంగులను కనబడకుండా చేయాలంటే వాటిపై మళ్లీ ఎమల్షన్ రంగులే వేయాలి.  ఇలా రాష్ట్రం మొత్తం చేయాలంటే కోట్లాది రూపాయలు వెచ్చించాలి.  ఈ మొత్తం ఖర్చు కూడా పంచాయతీ నిధుల నుండే తీయాలి.  అసలే రాష్ట్రంలోని సగం పంచాయతీలు అరకొర నిధులతో నడుస్తున్న వైనం మనకు తెలుసు.  
 
అలాంటి తరుణంలో ఈ అనవసరమైన రంగుల ఖర్చుతో ఉన్న కాస్త నిధులు వృధా అయి పంచాయతీల ఖజానా మీద పెను భారం పడుతోంది.  మొత్తానికి రంగుల పబ్లిసిటీ యావలో  ప్రభుత్వం చేసిన పొరపాటుకు ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది.  మరోవైపు ప్రతిపక్ష టీడీపీ నేతలు వేసింది వైసీపీ రంగులే కాబట్టి ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఖర్చు మొత్తాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండే వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.