వైఎస్ జగన్ వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్ల ఖర్చు రూ.43.44 లక్షలట 

Nara Lokesh satires on CM'S water bottles, Butter milk expenses
అవకాశం దొరికితే అధికార పక్షాన్ని దుయ్యబట్టడానికి ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయి.  ఎప్పుడెప్పుడు లొసుగులు చిక్కుతాయా ఆడేసుకుందామా అని చూస్తుంటారు.  ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ విషయంలో ప్రతిపక్షం టీడీపీకి అలాంటి అవకాశమే ఒకటి దొరికింది.  వైకాపా ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగంగా పెట్టిన ఖర్చుల వివరాలు బయటికొచ్చాయి.  విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, టీషర్ట్లు, టెంపరరీ టాయిలెట్స్, విఐపీ సోఫాల కోసం అయిన ఖర్చు అక్షరాలా రూ.43,99,757.  
 
 
అలాగే ప్రమాణస్వీకారం రోజున వాటర్ బాటిల్స్, ఎల్ఈడీ స్క్రీన్లు, సోఫాలు, స్నాక్స్, అకామిడేషన్, రవాణా ఖర్చులు రూ.58,49,089.  ఇలా చాలా కార్యక్రమాల్లో మంచినీళ్ళ బాటిల్స్, మజ్జిగ, స్నాక్స్ కోసం భారీ ఎత్తున ఖర్చు చూపడంతో ప్రతిపక్షం టీడీపీ విమర్శలు ఎక్కుపెట్టింది.  నారా లోకేష్ అయితే డ‌బ్బులు మంచినీళ్ల‌లా ఖ‌ర్చు చేశారంటే ఇదే! రాజుల సొమ్ము రాళ్ల పాలు, ఏపీ ప్ర‌జ‌ల సొమ్ము సీఎం నీళ్ల‌పాలు.  సీఎం ఒక మీటింగ్‌లో తాగిన వాట‌ర్‌ బాటిళ్లు, మ‌జ్జిగ ప్యాకెట్లు ఖ‌రీదు అక్ష‌రాలా 43.44 ల‌క్ష‌లు.  ఒక్క‌రోజులో ఇంత తాగారంటే అది అమృత‌మైనా అయ్యుండాలి, లేదంటే స్కామైనా చేసుండాలి” అంటూ లోకేష్ ట్వీట్ వేశారు.
 
 
అలాగే ‘ఏడాది క్రితం జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం రోజున‌ వాట‌ర్ బాటిల్స్‌, స్నాక్స్‌కి 59.49 లక్షలు బిల్లు అయ్యింద‌ట‌!  తిన్న‌వి స్నాక్సా? క‌రెన్సీ నోట్లా జ‌గ‌న్‌రెడ్డి గారూ!’ అంటూ లోకేష్ వ్యంగ్య విమర్శలు చేశారు.  ఇంకొంతమంది టీడీపీ నేతలైతే సీఎం నెలకు ఒకలా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటాను అంటూ మజ్జిగ, వాటర్ బాటిళ్ల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.  గతంలో వైకాపా కూడా టీడీపీ అధికారంలో ఉండగా నారా లోకేష్ డ్రైప్రూట్స్ కోసం రూ.14 లక్షలు ఖర్చు పెట్టారని పెద్ద రగడే చేశారు.  ఇప్పుడు తమ వంతు రావడంతో టీడీపీ శ్రేణులు రెట్టింపు రీతిలో విమర్శలు చేస్తోంది.